వారం రోజులు కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగించండి

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో విమర్శించారు.

వారం రోజులు కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగించండి
X

దిశ, మహదేవపూర్ : రాష్ట్ర ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో విమర్శించారు. చేతకాని పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం కేవలం వారం రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అప్పగించాలని, అప్పుడు రాష్ట్రానికి సాగు, తాగునీటిని ఏ విధంగా అందించవచ్చో తాము ప్రాజెక్టును నడిపించి చూపిస్తామని సంచలన సవాల్ విసిరారు.

ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌ను బీఆర్ఎస్ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి కేటీఆర్ సందర్శించారు. అక్కడ గోదావరి జలాల ఉధృతిని, పంప్ హౌస్ ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే, కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలకు నీటిని సులభంగా సరఫరా చేయవచ్చని శాస్త్రీయంగా వివరించారు.

రాజకీయ కక్ష సాధింపుల కోసం మేము ఇక్కడికి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని, రైతాంగం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుంచడానికే వచ్చాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి మోటార్లను ఆన్ చేయాలి. లేదంటే వేలాది మంది రైతులు, ప్రజలతో కలిసి మేమే స్వయంగా వచ్చి మోటార్లను ఆన్ చేస్తాం అని హెచ్చరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కన్నెపల్లి పంప్ హౌస్ అత్యంత కీలకమైందని పేర్కొన్న కేటీఆర్, దీని ద్వారా మహబూబాబాద్, రంగారెడ్డి మినహా ఉమ్మడి ఎనిమిది జిల్లాల సాగునీటి అవసరాలతో పాటు రాజధాని హైదరాబాద్ తాగునీటి అవసరాలను కూడా తీర్చగల అద్భుత సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొన్ని పిల్లర్లు కుంగిపోయాయనే సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్‌లోని బాహుబలి మోటార్లను కావాలనే ఆన్ చేయకుండా నిలిపివేసిందని ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది నిండుగా ప్రవహిస్తున్నప్పటికీ, ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రం మళ్లీ ఎడారిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇంజినీర్ల నివేదికలు, సూచనల మేరకు మేడిగడ్డ వద్ద నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ కేవలం నాలుగున్నర ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సామర్థ్యం కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కనీసం పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. రైతాంగాన్ని కాపాడేందుకు, ఎండిపోతున్న పొలాలకు నీరందించేందుకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్నెపల్లి పంప్ హౌస్‌లోని మోటార్లను ప్రారంభించి నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story