రాబోయే మూడు రోజులు వడగండ్ల వానలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

by Malleboina Mahesh |

తెలంగాణలో రాబోయే 3 రోజులు వడగండ్ల వానలు. కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఉరుములతో కూడిన మోస్తరు వర్ష సూచన!

రాబోయే మూడు రోజులు వడగండ్ల వానలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు ఒక్కసారిగా మారిన వాతావరణం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ రైతులకు మాత్రం తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. ఆకాశంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కామారెడ్డి, సిద్దిపేట, జనగాం జిల్లాలో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు అధికారులు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వేసవి తాపం కారణంగా ఏర్పడే క్యుములోనింబస్ మేఘాల వల్ల ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల వరకు తగ్గి ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. అయితే, ఉరుములు మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని, రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం వేళల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది.

Next Story