సినిమాను తలపించేలా హెచ్-న్యూ (H-NEW) ఆపరేషన్

by Malleboina Mahesh |

హైదరాబాద్ హెచ్-న్యూ పోలీసుల సాహసోపేత ఆపరేషన్.. జార్ఖండ్‌లో మారువేషంలో 10 రోజులుండి స్పీడ్ పోస్ట్ గంజాయి డాన్ సత్యం మిశ్రా అరెస్ట్!

సినిమాను తలపించేలా హెచ్-న్యూ (H-NEW) ఆపరేషన్
X

దిశ, సిటీక్రైం: హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు సాహసోపేత ఆపరేషన్‌ను చేపట్టిన సీన్ ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. హెచ్ న్యూ పోలీసులకు ఇటీవల గంజాయి దందాకు సంబంధించిన ఓ కీలక సమాచారం అందింది. ప్రాథమిక విచారణలో ఈ గంజాయి దందాను ఎవరి కంట పడకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా నడిపిస్తున్నారని పసిగట్టారు. అయితే ఈ స్పీడ్ పోస్ట్ గంజాయి దందాను జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామం నుంచి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎలాగైనా ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని చాలేంజింగ్‌గా తీసుకున్న పోలీసులు ప్రధాన సూత్రధారిని పట్టుకుంటే మొత్తం నెట్‌వర్క్ మీద దెబ్బ కొట్టవచ్చని డిసైడ్ చేసుకున్నారు.

వేషం మార్చారు..

అయితే పోలీసులుగా వెళ్తే స్పీడ్ గంజాయి ముఠా అప్రమత్తమై పారిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. దీంతో పోలీసులు ముందుగా ఒక సుదీర్ఘ విచారణ జరిపి స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి దందాను నిర్వహిస్తున్న ప్రధాన సూత్రధారి లొకేషన్ సమాచారాన్ని పక్కాగా సేకరించారు. ఆపరేషన్‌ను కీలకంగా చేపట్టిన హెచ్ న్యూలోని టీం సభ్యులు ముందుగా వేషాన్ని మార్చుకున్నారు. దీని కోసం గడ్డం పెంచుకున్నారు. సాధారణ బట్టలు ధరించారు. రబ్బరు చెప్పులను వేసుకున్నారు. అలా జార్ఖండ్‌కు చేరుకున్నారు. ప్రధాన సూత్రధారి లొకేషన్‌కు చేరుకుని అక్కడ 10 రోజుల పాటు సంచరించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని చాలా మంది వీరిని ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు తమిళా?’ అంటూ పలు మార్లు ప్రశ్నించారు. ‘పని ఏదైనా దొరుకుతుందా..’ అంటూ వీరు అక్కడే ఉన్నారు.

సందర్భం చిక్కగానే రౌండప్

సత్యం మిశ్రా ఎప్పుడూ తన అనుచరులతో ఉండడం తో అప్పుడు అతనిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. నిరుత్సాహపడకుండా నిరంతరం అతనిపైనే నిఘా పెట్టారు. ఇలా 10 రోజులు దాటిన తర్వాత ఓ సందర్భం చిక్కగానే హెచ్ న్యూ పోలీసులు సత్యం మిశ్రాను రౌండప్ చేసి అదుపులోకి తీసుకుని బయలుదేరారు. కానీ అప్రమత్తమైన సత్యం మిశ్రా అనుచరులు స్థానికంగా మన వాడిని కిడ్నాప్ చేశారంటూ హాల్‌చల్ చేశారు. మన పోలీసులు అతనిని తీసుకుని వాహనంలో బయలు దేరగానే పలు చెక్ పోస్టుల వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుపడి ఎందుకు కిడ్నాప్ చేశారని ప్రశ్నించారు.

ఆపరేషన్‌లో ఉన్న పోలీసులు స్పీడ్ పోస్టు ద్వారా గంజాయి దందా చేస్తున్న స్మగ్లర్‌ను పట్టుకున్నామని, తాము చట్టబద్దంగా అతనిని స్థానిక కోర్టులో హాజరుపర్చి హైదరాబాద్‌కు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అక్కడి పోలీసులు సహకరించడంతో గంజాయి స్మగ్లర్ సత్యం మిశ్రా వ్యాపారానికి బ్రేక్ వేసి అతనిని కటకటాల వెనక్కి పంపారు. ఇలా యువతను గంజాయి, డ్రగ్స్ నుంచి కాపాడేందుకు హైదరాబాద్ హెచ్ న్యూ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ ఇతర రాష్ట్రాల పోలీసుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాద్ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్‌తో దేశవ్యాప్తంగా నడుస్తున్న సత్యం మిశ్రా గంజాయి దందా నెట్‌వర్క్ భగ్నమైంది. సత్యం మిశ్రాను హైదరాబాద్‌కు తీసుకువచ్చి జైలుకు పంపిన విషయం అందరికీ తెలిసిందే.

Next Story