- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రాయణగుట్టలో హెచ్-ఫాస్ట్ మెరుపు తనిఖీలు
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం, ఆహార కల్తీని అరికట్టడం లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(హెచ్-ఫాస్ట్) శుక్రవారం చంద్రాయణగుట్ట ప్రాంతంలోని ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

దిశ,చంపాపేట్: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం, ఆహార కల్తీని అరికట్టడం లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(హెచ్-ఫాస్ట్) శుక్రవారం చంద్రాయణగుట్ట ప్రాంతంలోని ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చేపట్టిన ఈ తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన రెండు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై కేసులు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చంద్రాయణగుట్టలోని అల్-మదీనా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఒమర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నిర్వహించిన తనిఖీల్లో పలు తీవ్ర లోపాలు బయటపడ్డాయి. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ, పదేపదే ఉపయోగించిన వంట నూనె వినియోగం, కృత్రిమ రంగుల వాడకం, పురుగుల నివారణ రికార్డులు లేకపోవడం, నీటి నాణ్యత ధ్రువపత్రాలు నిర్వహించకపోవడం, ఆహార పరిశుభ్రత ప్రమాణాలను పూర్తిగా విస్మరించడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
తనిఖీల సందర్భంగా సుమారు 20 లీటర్ల వాడిన వంట నూనె, 10 లీటర్ల తాజా వంట నూనె, 40 కిలోల వేయించిన చికెన్, 40 కిలోల కృత్రిమ రంగులు కలిపిన పచ్చి చికెన్, అలాగే 3 బాక్సులు, 6 ప్యాకెట్ల కృత్రిమ ఆహార రంగులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ప్రత్యేక తనిఖీలను హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్య, ఎస్‌ఐ వి. శంకర్, హెచ్-ఫాస్ట్ బృందం, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి ఆర్.దైవనిధి సంయుక్తంగా నిర్వహించారు. ప్రజలు అపరిశుభ్రమైన లేదా లైసెన్స్ లేని ఆహార కేంద్రాల్లో ఆహారం తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు ఎఫ్సై లైసెన్స్, తయారీ తేదీ, గడువు తేదీ, లేబులింగ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆహార కల్తీ లేదా అపరిశుభ్ర ఆహార విక్రయాలపై సమాచారం ఉంటే హెచ్ -ఫాస్ట్ టోల్ ఫ్రీ నంబర్ 8712661212కు ఫిర్యాదు చేయాలని కోరారు.






