- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చార్మినార్‌లో కల్తీ ఆహార మాఫియాపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం.. భారీగా పట్టుబడ్డ ఫ్రైడ్ చికెన్, వంట నూనె!
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార వ్యాపారులపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(హెచ్-ఫాస్ట్) కొరడా ఝళిపించింది.

దిశ, చంపాపేట్: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ ఆహార వ్యాపారులపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(హెచ్-ఫాస్ట్) కొరడా ఝళిపించింది. చార్మినార్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్‌పై నిర్వహించిన ఆకస్మిక దాడిలో భారీగా కల్తీ ఆహార పదార్థాలు, పాత వంట నూనెను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ లాడ్‌బజార్, పంచ్ మొహల్లాలో ఉన్న అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్‌లో హెచ్-ఫాస్ట్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేసి నిల్వ ఉంచుతున్నట్లు గుర్తించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు, నిషేధిత కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు, పలు మార్లు ఉపయోగించిన పాత వంట నూనెను మళ్లీ వినియోగిస్తున్నట్లు బయటపడింది. అలాగే నీటి నాణ్యత ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, పురుగుల నివారణ చర్యలు చేపట్టకపోవడం వంటి తీవ్ర ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. దాడిలో సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంటనూనె, కృత్రిమ రసాయన రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు విక్రయిస్తున్న ఆహారం ఆరోగ్యానికి హానికరమని నిర్ధారించిన అనంతరం సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
అధికారుల ప్రకారం.. ఇటువంటి కల్తీ ఆహార పదార్థాల వినియోగం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, జీర్ణాశయ వ్యాధులు, కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఆహార భద్రత విషయంలో నగర పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారని, ప్రజలు లైసెన్స్ కలిగిన ఆహార విక్రయ కేంద్రాల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సూచించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు లేదా కల్తీ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.






