- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బార్బీ క్యూ నేషన్ రెస్టారెంట్ పై హెచ్-ఫాస్ట్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఉప్పర్‌పల్లిలోని బార్బీ క్యూ నేషన్ రెస్టారెంట్‌పై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

దిశ, రాజేంద్రనగర్ : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఉప్పర్‌పల్లిలోని బార్బీ క్యూ నేషన్ రెస్టారెంట్‌పై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. బార్బీ క్యూ నేషన్‌లో ఆహారం తిన్న ఇద్దరికి ఫుడ్ పాయిజనింగ్ కావడంతో వారు హెచ్-ఫాస్ట్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్లిపోయిన మాంసం, పాడైపోయిన ఐస్‌క్రీమ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తూ వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన ప్రాన్స్, చేపలు, చికెన్, మటన్, పేస్ట్రీలు, కేకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు నెలల క్రితం నిర్వహించిన తనిఖీల్లో కూడా ఆహార భద్రత, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాల్లో తీవ్రలోపాలు బయటపడటంతో రెస్టారెంట్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ అధికారుల నోటీసులను పట్టించుకోకుండా యాజమాన్యం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆహార నిల్వలపై ఎక్స్‌పైరీ వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం కూడా అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ప్రాన్స్, చేపలు, చికెన్, మటన్, కేకుల నమూనాలను నాణ్యత పరీక్షల కోసం సంబంధిత ప్రయోగశాలకు పంపించారు. నిబంధనలు పాటించని హోటళ్ల పై అవసరమైన చర్యలు తీసుకుంటామని అత్తాపూర్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్యారెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో హెచ్-ఫాస్ట్ సీఐ అంజయ్య, ఎస్సై అఖిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






