కమీషన్ల కోసమే గురుకులాల టెండర్లు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

by Malleboina Mahesh |

రూ.2 వేల కోట్ల గురుకుల టెండర్లలో భారీ అవినీతిపై ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరికి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.

కమీషన్ల కోసమే గురుకులాల టెండర్లు: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు టెండర్లపై అవగాహన లేదని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అడ్లూరి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని.. గురుకుల టెండర్లపై హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అన్ని డాక్యుమెంట్లతో వస్తామని.. అవినీతిని నిరూపిస్తామన్నారు. తేదీ, సమయం అడ్లూరి నిర్ణయిస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. గురుకుల విద్యాసంస్థల టెండర్లను ప్రభుత్వం గద్దలా తన్నుకుపోయిందని.. టెండర్ల అవినీతిపై హరీశ్‌రావు మాట్లాడితే కాంగ్రెస్ మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారని.. అవినీతి బయటపడిన రోజు వారికి ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. టెండర్ల ప్రక్రియతో తనకు సంబంధం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారని.. అసలు మంత్రులకు టెండర్లపై అవగాహన లేదని తామూ చెబుతున్నామని అన్నారు. టెండర్ల విధానం మార్చేపుడు బోర్డు మీటింగ్‌లో చర్చ జరిగితే ఆ మినిట్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

రూ.630 కోట్లకు టెండర్లు పిలిచామని ఒకసారి అంటున్నారని.. ఆరు రోజులకే మాట మార్చి రూ.1,130 కోట్లకు పిలిచామన్నారని ఆరోపించారు. గ్రాసరీస్ టెండర్లు వాటిలో కలపలేదని.. మొత్తం టెండర్లు రూ.2 వేల కోట్లకు పైనే పిలిచారని తెలిపారు. గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి బహిరంగ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ టెండర్లపై అవగాహన లేనిది మంత్రి అడ్లూరికేనని అన్నారు. చేనేత సొసైటీలు, లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్లు టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకునేలా నిబంధనలు మార్చారని ఆరోపించారు. టెండర్ల డాక్యుమెంట్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కేవలం కమీషన్ల కోసమే టెండర్ల నిర్వహణ జరిగిందని ఆరోపించారు.

టెస్కోకు గురుకుల టెండర్లలో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్‌రెడ్డికి లెటర్ రాసినా దాన్ని పక్కన బెట్టారని పేర్కొన్నారు. మరోవైపు.. బతుకమ్మ చీరలు గుజరాత్ వాళ్లకు ఇచ్చారని.. టెస్కోను, లెదర్ కార్పొరేషన్లను కాదని గుజరాత్‌కు చెందిన మఫత్ లాల్ కంపెనీకి విలువైన 5 టెండర్లు కట్టబెట్టారని అన్నారు. బడే భాయ్, చంద్రబాబు చెప్పిన వారికే కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా వేం నరేందర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల పేర్లే వినిపిస్తున్నాయని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెతకు ఆనంద్, బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story