- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణరంగంగా మారిన గుండ్లపల్లి గ్రామం
గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతల్లి సమత భర్త రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందడంతో గురువారం ఆయన మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి తరలించారు.

దిశ, గన్నేరువరం : గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతల్లి సమత భర్త రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందడంతో గురువారం ఆయన మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఏ మురళీధర్ రెడ్డితో పాటు మరో నలుగురిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసుల హామీతో వారు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని గుండ్లపల్లి గ్రామానికి తరలిస్తుండగా రాజీవ్ రహదారిపై గుండ్లపల్లి స్టేజి వద్ద మృతుని భార్య, బంధువులు రోడ్డుపై బైఠాయించి నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారితో చర్చించి రోడ్డుపై నుంచి తప్పించగా, అప్పటికే రాజీవ్ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పీఏ ఇంటి ముట్టడికి యత్నం.. లాఠీచార్జ్..
మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్తున్న సమయంలో పీఏ మురళీధర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న బంధువులు ఒక్కసారిగా ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. తీవ్ర భద్రతా ఏర్పాట్ల మధ్య రాజేందర్ రెడ్డి మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. బంధువుల రోదనలు గ్రామస్తులను కలచివేశాయి.
న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరిక..
ఈ సందర్భంగా మృతుని భార్య బేతల్లి సమత మాట్లాడుతూ, పోలీసుల హామీ మేరకు మృతదేహాన్ని ఇంటికి చేర్చినప్పటికీ నిందితులను అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి మద్దతుగా బీఆర్ఎస్ మండల నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






