- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీవీ ఆశయాలకు శాశ్వత చిరునామా.. వంగరలో విజ్ఞాన కేంద్రం
భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేసే లక్ష్యంతో ఆయన స్వగ్రామం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులు తుదిదశకు చేరుకున్నాయి.

దిశ, భీమదేవరపల్లి : భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేసే లక్ష్యంతో ఆయన స్వగ్రామం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మంత్రి విజ్ఞాన కేంద్రంలోని ఫొటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, అంఫిథియేటర్, ఆడిటోరియం, ధ్యాన మందిరం, సందర్శకుల విభాగాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రతి విభాగం పీవీ నరసింహారావు దూరదృష్టి, పరిపాలనా సామర్థ్యం, దేశ నిర్మాణంలో ఆయన పోషించిన చారిత్రక పాత్రను ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని సూచించారు.
పీవీ జీవిత విశేషాలు ప్రతిబింబించేలా గ్యాలరీ...
ఫొటో గ్యాలరీలో పీవీ బాల్యం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు సాగిన జీవిత ప్రస్థానం, ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానంలో తీసుకొచ్చిన మార్పులు, బహుభాషా పాండిత్యం, దేశానికి అందించిన విశిష్ట సేవలను ప్రతిబింబించే అరుదైన చిత్రాలు, చారిత్రక పత్రాలు, జ్ఞాపకాలను మరింత సమగ్రంగా ప్రదర్శించే అంశంపై పీవీ కుమారులు ప్రభాకర్ రావు, రాజేశ్వర్ రావుతో మంత్రి చర్చించి పలు సూచనలు చేశారు.
జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే కేంద్రం..
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు తెలంగాణకే కాకుండా దేశానికి దిశానిర్దేశం చేసిన మహానేత. ఆయన ఆలోచనలు, విలువలు, పరిపాలనా దక్షత, సంస్కరణల స్ఫూర్తిని యువతకు చేరవేసే శాశ్వత జ్ఞాన కేంద్రంగా వంగర విజ్ఞాన కేంద్రం నిలవాలి" అని అన్నారు. కేంద్రం చుట్టూ గార్డెన్ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, విస్తృతంగా మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించామని తెలిపారు. విజ్ఞాన కేంద్రం ప్రారంభమైన తర్వాత వంగర జాతీయ స్థాయిలో విద్యా, చారిత్రక, పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీవీ నరసింహారావు కుమారులు ప్రభాకర్ రావు, రాజేశ్వర్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కుల అనిల్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అధికారులు, సీఐ పులి రమేష్, ఎస్సైలు దివ్య, రాజు, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.






