KPHB లూలూ మాల్‌లో గన్ కలకలం

by Muthe.Rajitha |

హైదరాబాద్‌ KPHB పరిధిలోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ 'లూలూ మాల్'లో గన్ కనిపించడం సంచలనం రేపుతోంది.

KPHB లూలూ మాల్‌లో గన్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ (KPHB) పరిధిలోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ 'లూలూ మాల్'(Lulu Mall)లో గన్ కనిపించడం సంచలనం రేపుతోంది. వీకెండ్ రద్దీ నేపథ్యంలో మాల్‌లోని పార్కింగ్ ఏరియాలో రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం.. చివరకు గన్ కలకలానికి దారితీసింది. మాల్‌లాంటి పబ్లిక్ ప్రదేశంలో ఒక వ్యక్తి ఏకంగా తుపాకీ తీసి బెదిరింపులకు దిగడంతో అక్కడ ఉన్న మిగతా సందర్శకులు భయాందోళనలతో పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. లూలూ మాల్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ బేలో కారు పార్క్ చేసే క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ఒక వ్యక్తి, తన వద్ద ఉన్న గన్‌ను బయటకు తీసి ఎదుటి కుటుంబ సభ్యులను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. ఈ హఠాత్ పరిణామంతో మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పరిస్థితి చేతులు దాటిపోయే ప్రమాదం ఉండటంతో వారు తక్షణమే కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ హైడ్రామాకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ మాల్‌లోకి గన్‌తో ప్రవేశించడం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు.. సదరు వ్యక్తికి గన్ లైసెన్స్ ఉందా? లేదా? అనే కోణంతో పాటు, మాల్ సిసిటివి (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తూ లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story