జీఎస్టీ మ్యాజిక్: కన్స్యూమర్ కంపెనీలకు ఇక లాభాలే లాభాలు!

by Malleboina Mahesh |

జీఎస్టీ తగ్గింపు కారణంగా వినియోగదారుల ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో ముడిసరుకు ఖర్చులు తగ్గడం వంటి అంశాలు కన్స్యూమర్ స్టేపుల్ (నిత్యవసర వస్తువుల) కంపెనీలకు కలిసొస్తున్నాయి.

జీఎస్టీ మ్యాజిక్: కన్స్యూమర్ కంపెనీలకు ఇక లాభాలే లాభాలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (GST) స్లాబుల్లో మార్పులు చేసి సామాన్యులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ తగ్గింపు కారణంగా వినియోగదారుల ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో ముడిసరుకు ఖర్చులు తగ్గడం వంటి అంశాలు కన్స్యూమర్ స్టేపుల్ (నిత్యవసర వస్తువుల) కంపెనీలకు కలిసొస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) ఈ కంపెనీల లాభాల మార్జిన్లు గణనీయంగా మెరుగుపడే అవకాశముందని 'సిస్టమాటిక్స్ రీసెర్చ్' (Systematics Research') నివేదిక వెల్లడించింది. ఖర్చులు తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు ధరలను తగ్గించాయని, ఫలితంగా వస్తువుల డిమాండ్ పెరిగి అమ్మకాల పరిమాణం (Volume Growth) పుంజుకుంటుందని నివేదిక అంచనా వేసింది.

అలాగే, కంపెనీలు తమ పంపిణీ నెట్‌వర్క్‌లను విస్తరించడం కూడా ఈ వృద్ధికి దోహదపడుతుందని సిస్టమాటిక్స్ రీసెర్చ్ పేర్కొంది. మూడో త్రైమాసికంలో బిస్కెట్లు, సబ్బులు, హెయిర్ ఆయిల్స్, నూడుల్స్, కాఫీ, చాక్లెట్లు వంటి ఉత్పత్తుల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. చలికాలం కారణంగా స్కిన్ కేర్ ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్, తేనెకు డిమాండ్ పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెయింట్స్ విభాగం కూడా కోలుకుంది. అయితే టీ, వంట నూనెలు, పాల ఉత్పత్తుల విక్రయాలు మాత్రం కాస్త మందగించాయి. మొత్తంగా రెండో త్రైమాసికంలో డీలర్ల వద్ద నిల్వలు తగ్గడం (destocking) వంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయని, నాలుగో త్రైమాసికానికి కంపెనీలు లాభాల బాటలో పయనిస్తాయని సిస్టమాటిక్స్ రీసెర్చ్ తన నివేదిక స్పష్టం చేసింది.

Next Story