మార్కెట్‌లో గ్రో (Groww) షేర్ల జోరు.. రికార్డు స్థాయికి చేరిన ధర

by Malleboina Mahesh |

గ్రో (Groww) మాతృసంస్థ షేర్ల జోరు! ₹235 టార్గెట్ ఇచ్చిన BofA. ఇష్యూ ధర నుండి 135% రిటర్న్స్.. నేడు రికార్డు స్థాయిలో ₹208కి చేరిన ధర.

మార్కెట్‌లో గ్రో (Groww) షేర్ల జోరు.. రికార్డు స్థాయికి చేరిన ధర
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫారమ్ 'గ్రో' (Groww) మాతృసంస్థ.. బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు బుధవారం మార్కెట్‌లో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ అమెరికా' (BofA) ఈ స్టాక్‌కు అత్యధిక టార్గెట్ ధరను ప్రకటించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. BofA ఈ షేరుకు ₹235 టార్గెట్ ధరను నిర్ణయిస్తూ 'బై' (Buy) రేటింగ్‌ను ఇచ్చింది. దీని ప్రభావంతో నేడు షేర్ ధర ఒక్కసారిగా 7 శాతం మేర పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి ₹208.36 వద్దకు చేరుకుంది. గతేడాది నవంబర్‌లో ఐపీఓగా వచ్చిన ఈ స్టాక్, తన ఇష్యూ ధర నుండి ఇప్పటివరకు ఇన్వెస్టర్లకు సుమారు 135 శాతం లాభాలను అందించడం విశేషం.

ప్రస్తుతం భారతదేశంలోని యాక్టివ్ క్లయింట్ల జాబితాలో 28 శాతం మార్కెట్ వాటాతో 'గ్రో' అగ్ర స్థానంలో కొనసాగుతోంది. దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతుండటం, యువత ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతుండటం ఈ సంస్థకు కలిసివస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 నుంచి 2028 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం ఏటా 30 శాతం వృద్ధి సాధిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. ఇదిలా ఉండగా, వచ్చే వారం ఏప్రిల్ 20న కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. అయితే ఐపీఓ తర్వాత ఉన్న ఆరు నెలల లాక్-ఇన్ పీరియడ్ ముగిసే సమయం దగ్గర పడుతుండడంతో, కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కొంత అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Next Story