నల్లగుంటలో విద్యా విప్లవం : ప్రభుత్వ బడికే పంపాలని తీర్మానం

by Batti.Sumithra |

పిల్లల చేతిలో పుస్తకం ఉండాలి... కూలి పనిముట్టు కాదు అనే నినాదంతో నల్లగుంట గ్రామపంచాయతీ సోమవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

నల్లగుంటలో విద్యా విప్లవం : ప్రభుత్వ బడికే పంపాలని తీర్మానం
X

దిశ, వెంకటాపూర్, రామప్ప : పిల్లల చేతిలో పుస్తకం ఉండాలి... కూలి పనిముట్టు కాదు అనే నినాదంతో నల్లగుంట గ్రామపంచాయతీ సోమవారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల ప్రతి బిడ్డను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సర్పంచ్ భూక్యా శ్రీదేవి, శంకర్ నాయక్ అధ్యక్షతన, ఉపసర్పంచ్ మోరే లింగస్వామి, పదిమంది వార్డు సభ్యుల సమక్షంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా శ్రీదేవి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా గ్రామంలో ఇరవై మందికి పైగా పిల్లలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడికి వెళ్లడం లేదని తెలిపారు. కొంతమంది తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల ఫీజులు చెల్లించలేకపోతుండగా, మరికొందరు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉండదనే అపోహతో పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడం మానేశారని అన్నారు.

అయితే, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. అలాగే సంవత్సరానికి రెండు జతల యూనిఫాంలు, బూట్లు, సాక్సులు కూడా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రతిరోజు వేడి వేడి మధ్యాహ్న భోజనం, వారంలో మూడు రోజుల పాటు గుడ్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలకు సంవత్సరానికి రూ.1,000 స్కాలర్‌షిప్, తరగతి గదుల్లో టీవీలు, సైన్స్ పరికరాలు, గ్రంథాలయం వంటి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అదే ప్రైవేటు పాఠశాలల్లో సంవత్సరానికి కనీసం రూ.15 వేల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని, పిల్లలకు అవసరమైన ప్రతి వస్తువును తల్లిదండ్రులే కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

గత సంవత్సరం నల్లగుంట గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించారని గుర్తు చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి విద్యాసంస్థల్లో ఉచిత సీట్లు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చదువు మానేస్తే పదిహేనేళ్లకే కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అమ్మలారా.. ఫీజులు లేవని పిల్లలను ఇంట్లో ఉంచొద్దు. ఉపాధ్యాయులే ప్రతి ఇంటికి వచ్చి పిల్లలను బడికి తీసుకువస్తారు. మన గ్రామ పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు అని సర్పంచ్ పేర్కొన్నారు. జూన్ 20వ తేదీ నుంచి ప్రతి వార్డు సభ్యుడు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి, బడికి వెళ్లని పిల్లల జాబితాను సిద్ధం చేస్తారని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులతో కలిసి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అన్ని సౌకర్యాలను వివరిస్తారని, మధ్యాహ్న భోజన నాణ్యతను కూడా చూపిస్తారని చెప్పారు. మీ బిడ్డకు ఆరు సంవత్సరాలు నిండితే వెంటనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి.

మధ్యలో చదువు మానేసినా మళ్లీ బడిలో చేర్పించండి. మీ వీధిలో ఎవరైనా పిల్లలు చదువు మానేస్తే వెంటనే సంబంధిత వార్డు సభ్యునికి సమాచారం ఇవ్వండి. కొత్తగా చేరే విద్యార్థులకు సంచి, పెన్ను, పలక అందజేస్తాం అని తెలిపారు. చదువు అంటే పెట్టుబడి. లక్ష రూపాయలు ఫీజు కట్టడం గొప్ప కాదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బిడ్డను ఉపాధ్యాయుడిగా, పోలీసు అధికారిగా, డాక్టర్‌గా తీర్చిదిద్దడం గొప్ప విషయం అని సర్పంచ్ భూక్యా శ్రీదేవి అన్నారు. నల్లగుంట గ్రామంలోని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే, జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాల విద్యకు ఆదర్శ గ్రామంగా నల్లగుంట గుర్తింపు పొందుతుందని, అది గ్రామ ప్రజలందరికీ గర్వకారణమవుతుందని ఆమె పేర్కొన్నారు.

Next Story