ధాన్యం పక్కదారి..!

by Jakkula.Mamatha |

ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చిన రైస్ మిల్లర్లు మారడం లేదు. కోట్ల రూపాయల ధాన్యం కేటాయింపులు చేసిన పట్టించుకోవడం లేదు

ధాన్యం పక్కదారి..!
X

దిశ, వరంగల్ బ్యూరో: ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చిన రైస్ మిల్లర్లు మారడం లేదు. కోట్ల రూపాయల ధాన్యం కేటాయింపులు చేసిన పట్టించుకోవడం లేదు. కస్టం మిల్లింగ్ కింద కేటాయించిన ధాన్యంకు అనుగుణంగా బియ్యాన్ని అందించడం లేదు. కొంతమంది బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చిన కొంత మంది మిల్లర్లు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం బియ్యాన్ని కస్టం మిల్లింగ్ కింద ఎఫ్సీఐకి పంపడం లేదు. మిల్లర్లలో కదలిక లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో గత రబీ, ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యం కేటాయింపులపై అధికారులు తనిఖీలు చేపట్టారు. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించడంతో పాటు కేటాయింపులకు అనుగుణంగా లేని వారికి నోటీసులను జారీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి సీజన్ లో ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ కెపాసిటీకి అనుగుణంగా మిల్లులకు కేటాయిస్తున్నారు.

కస్టం మిల్లింగ్ కింద నిర్ణీత సమయంలో బియ్యాన్ని అందించే విధంగా ఒప్పందాలు చేసుకుని ధరావత్ లేకుండానే మిల్లర్ల గ్యారంటీతో ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ధాన్యం కేటాయింపులు చేసిన కొంత మంది మిల్లర్లు బియ్యాన్ని నిబంధనలకు అనుగుణంగా అందించడం లేదు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉండటంతో కొంతమంది మిల్లర్లు కోట్ల రూపాయల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఏపీ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అసోసియేషన్ లో చక్రం తిప్పుతూ ప్రజాప్రతినిధుల అండతో వాయిదా వేస్తున్నారు. ఏళ్ల తరబడి నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 2022-23 సంవత్సరానికి సంబంధించి కొన్ని మిల్లుల బకాయిలు 230 కోట్ల వరకు ఉన్నాయి. వీటిని వసూలు చేయడం అధికారులకు కత్తిమీద సాములాగా మారింది. పూర్తిస్థాయిలో కస్టం మిల్లింగ్ కింద కేటాయించిన ధాన్యానికి అనుగుణంగా బియ్యం కేటాయించలేదు.

ప్రజాప్రతినిధులను కలుస్తూ..

మిల్లర్లు వాయిదాలు వేస్తుండటం గత ఖరీఫ్, రబీలో కేటాయించిన ధాన్యానికి అనుగుణంగా కస్టం మిల్లింగ్ కింద బియ్యాన్ని ఇవ్వలేదు. చాలా మిల్లులు ఇప్పటి వరకు ఎఫ్సీఐకి పెట్టకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన కొన్ని రోజులుగా రైస్ మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు పౌరసరఫరాల సంస్థ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు. వీరితో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 500 లకు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. వీటన్నింటి పరిధిలో తనిఖీలు చేయడంతో పాటు కేటాయింపులకు అనుగుణంగా ధాన్యం, బియ్యం ఉన్నాయా లేవో పరిశీలిస్తున్నారు. వాటికి సంబంధించి వివరాలు తీసుకోవడంతో పాటు తేడాలు ఉన్న మిల్లులకు నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలకు సిద్ధమవుతున్నారు. నిర్ణీత సమయంలో బియ్యాన్ని అందించాలని ఆదేశాలు ఇస్తున్నారు. నర్షంపేట, ములుగు, హన్మకొండ పరిధిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన తనిఖీలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.

ఉమ్మడి జిల్లా పరిధిలోని మిల్లులలో తనిఖీలు మొదలు కావడంతో రైస్ మిల్లర్ అసోసియేషన్ నేతలు కదిలారు. ప్రజాప్రతినిధులను కలుస్తూ ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. తనిఖీలను ఆపడంతో పాటు పాత వాటికి కూడా సమయం ఇవ్వాలని కోరుతున్నారు. కొంత మంది మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని కోట్ల రూపాయలు సంపాదించారు.. వారం రోజులుగా జరుగుతున్న మిల్లుల తనిఖీలతో ఆందోళన చెందుతున్న మిల్లర్లు ఏకమై ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ తనిఖీలు చేస్తున్నట్లు వరంగల్ డీఎస్వో కిష్టయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు తెలిపారు. తమ పరిధిలో మిల్లుల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.

Next Story