మరణాన్ని గెలిచిన మాతృత్వం.. గర్భాశయ మార్పిడితో గ్రేస్ బెల్ అద్భుతం!

by Malleboina Mahesh |

పుట్టుకతో గర్భాశయం లేని మహిళ, మరణించిన దాత నుంచి సేకరించిన గర్భాశయంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైనం. యూకే వైద్య చరిత్రలో ఇదే తొలిసారి.

మరణాన్ని గెలిచిన మాతృత్వం.. గర్భాశయ మార్పిడితో గ్రేస్ బెల్ అద్భుతం!
X

దిశ, వెబ్ డెస్క్: గర్భాశయం లేని ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. వైద్యశాస్త్రం అసాధ్యం అనుకున్న చోట ఆశల దీపం వెలిగించిన అద్భుతం ఆవిష్కృతం అయింది. వివరాల్లోకి వెళితే.. గ్రేస్ బెల్ అనే మహిళ పుట్టుకతోనే 'గర్భాశయం' లేని అరుదైన సమస్యతో జన్మించింది. మాతృత్వానికి దూరమయ్యానని భావించిన ఆమె జీవితంలోకి మరణించిన ఒక అపరిచిత దాత వరంలా వచ్చారు. 40 ఏళ్ల వయసులో మరణించిన ఆ దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని, సుమారు 17 గంటల పాటు జరిగిన సంక్లిష్ట శస్త్రచికిత్స ద్వారా గ్రేస్‌కు అమర్చారు. యూకే వైద్య చరిత్రలోనే ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగంగా నిలిచింది.

శస్త్రచికిత్స తర్వాత అసలైన సవాల్ మొదలైంది. మార్పిడి జరిగిన గర్భాశయం గ్రేస్ శరీరాన్ని అనుసంధానించు కోవడం తో పాటు, గర్భం దాల్చడం అనేది ఒక అద్భుతం. వైద్యులు ఐవీఎఫ్ (IVF) పద్ధతిని ఉపయోగించి ఆమె సొంత అండాలతో గర్భం దాల్చేలా చేశారు. ప్రతీ క్షణం వైద్యుల నిఘాలో సాగిన ఈ ప్రయాణం చివరికి ఫలించింది. క్రిస్మస్‌కు ముందే గ్రేస్ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా భావోద్వేగాలతో నిండిపోయింది.

ఆ చిన్నారికి 'హ్యూగో' అని పేరు పెట్టారు. మరణానంతర అవయవ దానం కేవలం ప్రాణాలను కాపాడటమే కాదు, కొత్త ప్రాణాలకు ఊపిరి పోస్తుందని ఈ ఘటన నిరూపించింది. మాతృత్వంపై ఆశలు వదులుకున్న వేలాది మంది మహిళలకు గ్రేస్ బెల్ విజయం ఒక సరికొత్త భరోసాను ఇస్తుంది. వైద్యులు, దాతల త్యాగం, ఒక తల్లి పట్టుదల కలిసి వైద్య చరిత్రలో 'హ్యూగో' రూపంలో ఒక చిరస్మరణీయ అధ్యాయాన్ని లిఖించాయి.

Next Story