ప్రశ్నించినందుకే పనులు ఆపేశారు.. పారిశుద్య కార్మికురాలిగా కౌన్సిలర్

by Disha Web Desk 14 |
ప్రశ్నించినందుకే పనులు ఆపేశారు.. పారిశుద్య కార్మికురాలిగా కౌన్సిలర్
X

దిశ, అమరచింత : వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని దళితవాడకు చెందిన 4వ వార్డు కౌన్సిలర్ సింధు.. పారిశుధ్య కార్మికురాలిగా మారి డ్రైనేజీలు శుభ్రం చేయడం మొదలు పెట్టింది. ఇదేం కర్మ.. బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా ఉంటూ, పారిశుధ్య పనులు చేయడం విడ్డురంగా ఉందనుకుంటున్నారా! మీరు విన్నది నిజమేనండీ. ఆ కౌన్సిలర్ మాటలు అధికారులు, పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఈ పని చేసింది. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఏమి సమాధానం చెప్పుకోవాలో పాలుపోక.. స్వయంగా పారిశుధ్య కార్మికురాలిగా మారి ఆ మురుగు తొలగిస్తూ నిరసన తెలిపింది.

మున్సిపల్ సమావేశాల్లో పాలక వర్గం చేసిన ఖర్చుల లెక్కలు చెప్పమని అడిగినందుకే.. తన వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగకుండా కక్షసాధింపు చర్యలు చేపట్టారని ఆ వార్డు కౌన్సిలర్ సింధు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభివృద్ధి, సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పనులు చేపడుతుంటే...ఇక్కడ దానికి భిన్నంగా పాలకవర్గం వ్యవహరిస్తుందని ఆమె ఆరోపిస్తున్నారు. దళిత మహిళా కౌన్సిలర్ కావడం వల్లే ఇక్కడ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిందా..! లేక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం ఆమె చేసిన తప్పా..? ఏది ఏమైనా దళిత వాడల అభివృద్ధి, పారిశుధ్య పనులపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


Next Story