ఉపాధ్యాయుల పట్టుదలతో ప్రభుత్వ బడికి పునర్జీవం

by Ratna Kumari |

ఒకప్పుడు విద్యార్థుల కొరతతో ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకున్న మేళ్లచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.

ఉపాధ్యాయుల పట్టుదలతో ప్రభుత్వ బడికి పునర్జీవం
X

దిశ, మేళ్లచెరువు : ఒకప్పుడు విద్యార్థుల కొరతతో ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకున్న మేళ్లచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఉపాధ్యాయుల అంకితభావం, గ్రామ పెద్దల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాఠశాల తిరిగి విద్యార్థులతో కళకళలాడుతోంది. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం పాఠశాలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ఫలితంగా 2026–27 విద్యా సంవత్సరంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కొత్తగా చేరగా, ప్రస్తుతం పాఠశాలలో 166 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తూ ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్న ఫలితంగానే ఈ మార్పు సాధ్యమైందని ప్రధానోపాధ్యాయుడు నారపరెడ్డి తెలిపారు. గ్రామ పెద్దలు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు అందించిన సహకారం కూడా పాఠశాల అభివృద్ధికి ఎంతో దోహదపడిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకానికి మేళ్లచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విద్యా విజయాలు సాధించేందుకు కృషి కొనసాగిస్తామని పాఠశాల విద్యా కమిటీ తెలిపింది.

Next Story