అయిజలో రూ.3 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటుపరం!

by Jakkula.Mamatha |

గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి.

అయిజలో రూ.3 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటుపరం!
X

దిశ, అయిజ: గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. పట్టణం నడిబొడ్డున, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతున్న మున్సిపల్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు మాకేమీ పట్టదు అన్నట్లు వ్యవహరించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయిజలో శ్మశాన వాటికలు ఉండడంతో పాటు, సహజసిద్ధమైన వాగు ప్రవాహం ఉండే ప్రభుత్వ భూమిని కొంతమంది అధికార బలాన్ని ఉపయోగించుకొని కబ్జా చేస్తూ వస్తున్నారు. ఇక్కడ దాదాపుగా మూడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆరు గుంటల స్థలాన్ని కబ్జాదారులు దర్జాగా ఆక్రమించుకొని భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలోనే ఒక గుంటకు పైగా స్థలాన్ని ఆక్రమించిన కబ్జాదారులు కొందరు.. ఇప్పుడు ఏకంగా నకిలీ ధ్రువీకరణ పత్రాలను (ఫేక్ సర్టిఫికెట్లు) సృష్టించి, ఆ స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. ఈ విషయమై గతంలో కొంతమంది స్థానిక పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సదరు ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని, ఒకవేళ ఆక్రమించి నిర్మాణాలు చేస్తే భవిష్యత్తులో వరద ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుందని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ ఆదేశాలు తమకు ఏమాత్రం వర్తించవన్నట్లుగా కబ్జాదారులు కోర్టు ఆర్డర్లను సైతం బేఖాతరు చేస్తూ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ప్రజలు, సామాజిక కార్యకర్తలు మున్సిపల్ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు పదే పదే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా వారు కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ పరం కాబోతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఆదేశాలు ఉన్న డోంట్ కేర్..

పట్టణం నడిబొడ్డున ఉన్న స్థలం పూర్తిగా ప్రభుత్వ భూమి అని, నిజానిజాలు తేల్చే వరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలో న్యాయస్థానం స్టే ఇచ్చింది. కానీ ఆ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆక్రమణదారులు అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం ఈ నిర్మాణాలను ఆపే ప్రయత్నం కూడా చేయకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు, ఆ భూమిని స్వాధీన పరుచుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

కనిపిస్తే కబ్జాలు.. ముఠాలదే హవా!

అయిజ పట్టణం మునిసిపాలిటీగా మారి వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాటు రానున్న రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భూముల ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. దీనిని ఆసరాగా చేసుకుని ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా, సమస్యాత్మక భూములు ఉన్నా వాటిని గుర్తించి కబ్జాదారులు ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఇరు వర్గాల మధ్య ఉన్న భూ సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకుని, ఆ స్థలాలను తక్కువ ధరకు లాక్కోవడం లేదా బెదిరింపులకు పాల్పడి ఆక్రమించుకోవడం వంటి దందాలకు తెరలేపారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story