ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు 'థాలా' రెడీ

by Malleboina Mahesh |

ఎంఎస్ ధోనీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి రేపు ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. అయితే, చేపాక్ మైదానంలో ధోనీకి ఇదే ఆఖరి మ్యాచ్ కానుంది.

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు థాలా రెడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL 2026) లో మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) అభిమానులు ఆయన ఆటను ఎంతగానో మిస్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ ఆరంభంలోనే జట్టులో చేరిన ధోని.. పూర్తి ఫిట్ నెస్ దక్కించుకోకపోవడంతో ప్లేయింగ్ 11 జట్టులో కనిపించడం లేదు. దీంతో ఆయన ఎప్పుడు ఆడతారా అని కోట్ల మంది అభిమానులకు ఎదురుచూస్తుండగా.. ఎట్టకేలకు ఒక అద్భుతమైన శుభవార్త అందింది. ఫిట్‌నెస్ సమస్యల (Fitness issues) కారణంగా మైదానానికి దూరమైన ధోనీ.. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మే 18 (రేపు) చెన్నైలోని చేపాక్ స్టేడియం (Chepauk Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో జరగబోయే కీలక పోరులో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తుది జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. 'థాలా' మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగుతున్నాడనే వార్తతో సీఎస్‌కే క్యాంప్‌లో సరికొత్త జోష్ నెలకొంది.

అయితే.. ఈ ఆనందంతో పాటే ధోనీ ఫ్యాన్స్‌ (Dhoni fans)కు ఒక భావోద్వేగమైన వార్త కూడా వినబడుతోంది. చపాక్ స్టేడియంలో ధోనీకి ఇదే ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు చేపాక్ హోమ్ గ్రౌండ్‌లో రేపు జరగబోయే మ్యాచే చివరిది. దీని తర్వాత మే 21న సీఎస్‌కే తన తదుపరి లీగ్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో ఆడనుంది. ఒకవేళ చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ.. ఈసారి ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు ముంబై, అహ్మదాబాద్ వేదికల్లోనే జరగనున్నాయి. అంటే దక్షిణాదిలో ఇకపై ఎలాంటి మ్యాచులు లేవు. ధోనీకి ఆటగాడిగా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారాల నడుమ.. రేపు చేపాక్ మైదానంలో హోమ్ క్రౌడ్ ముందు ధోనీ ఆడే చివరి మ్యాచ్‌ను చూసేందుకు టికెట్ల డిమాండ్ ఆకాశాన్ని తాకింది.

Next Story