10th ఫెయిల్ విద్యార్థులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |   (  Updated:2026-05-07 06:40:44  IST  )

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో చదివి 10థ్ ఫెయిల్ అయిన విద్యార్థులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది.

10th ఫెయిల్ విద్యార్థులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో చదివి 10థ్ ఫెయిల్ అయిన విద్యార్థులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ రెండు ‘పీఎంశ్రీ’ (PM SHRI) పాఠశాలలను ఎంపిక చేసి, అక్కడ మే 12 నుండి జూన్ 3 వరకు ప్రత్యేక రెమిడియల్ కోచింగ్ క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ క్యాంపులలో సబ్జెక్టు నిపుణులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు కీలకమైన అంశాలపై ప్రత్యేక శిక్షణనిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తారు.

ఈ శిక్షణ కార్యక్రమం కేవలం బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంది. కోచింగ్‌కు హాజరయ్యే ప్రతి విద్యార్థికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, ఇతర స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేయడంతో పాటు, వారికి ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్ కూడా అందించనున్నారు. అంతేకాకుండా, విద్యార్థులు తమ ఇళ్ల నుండి శిక్షణ కేంద్రాలకు చేరుకోవడానికి అయ్యే రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.1,100 చొప్పున ప్రభుత్వం నిధులను వెచ్చిస్తోంది. విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడటమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మెరుగుపరచడం, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య లక్ష్యాలని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రైవేట్ ట్యూషన్లకు వెళ్లలేని ఆర్థిక స్థితిలో ఉంటారని గుర్తించిన ప్రభుత్వం, ఈ ఉచిత కోచింగ్ ద్వారా వారికి రెండో అవకాశం కల్పిస్తోంది. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకుని, సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

ఇంటర్ బోర్డు రద్దు దిశగా అధికారుల కసరత్తు!

Next Story