భారత ఎగుమతిదారులు, MSME రంగానికి సువర్ణావకాశం

by Malleboina Mahesh |

భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన అధికారిక ముసాయిదా విడుదలైంది.

భారత ఎగుమతిదారులు, MSME రంగానికి సువర్ణావకాశం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందానికి (historic agreement) సంబంధించిన అధికారిక ముసాయిదా విడుదలైంది. దీంతో ఇరు దేశాల నేతలు ఈ చారిత్రక ఒప్పందం పై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అయితే ఈ ఒప్పందం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తుంది. భారత్, అమెరికాల ఒప్పందం కారణంగా.. భారతీయ ఎగుమతిదారులకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ అందుబాటులోకి రానున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

ఇందులో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), వ్యవస్థాపకులు మరియు స్టార్టప్ ఆవిష్కర్తలు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడానికి భారీ అవకాశాలు లభిస్తాయి. అమెరికా తన దిగుమతి సుంకాలను (Tariffs) 18 శాతానికి తగ్గించడం వల్ల టెక్స్‌టైల్స్, లెదర్, ఫుట్‌వేర్, ప్లాస్టిక్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటి రంగాలకు చెందిన తయారీదారులు అంతర్జాతీయ విపణిలో గొప్ప లాభాలను పొందే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

నిరుద్యోగ యువత, మహిళలకు పెరుగుతున్న ఉపాధి

అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా, దేశంలో లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం చేస్తుంది. ఎగుమతులు పెరగడం వల్ల తయారీ, సేవా రంగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి, ఇవి ప్రధానంగా యువత, మహిళా కార్మికులకు ఎంతో మేలు చేస్తాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరిగి, మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని అంచనా వేయబడింది.

రైతులు, గ్రామీణ జీవనోపాధికి రక్షణ

ఈ ఒప్పందం కారణంగా భారత్ రైతులు, వ్యవసాయ రంగానికి నష్టం కలిగే అవకాశం ఉందని మొదట అనే విమర్శలు వచ్చాయి. అయితే దేశీయ వ్యవసాయ రంగంపై ప్రభావం చూపకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. భారత్ తన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సున్నితమైన వ్యవసాయ, పాడి ఉత్పత్తులైన వరి, గోధుమ, మొక్కజొన్న, పాలు, చీజ్, పౌల్ట్రీ వంటి వాటిని ఈ ఒప్పందం పరిధిలోకి రాకుండా పూర్తి రక్షణ కల్పించింది. దీనివల్ల అమెరికా నుంచి వచ్చే చౌకైన అగ్రి-ఉత్పత్తుల వల్ల మన రైతులు నష్టపోయే ప్రమాదం లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది.

అమెరికా నుంచి పోటీ- నాణ్యతా ప్రమాణాల సవాల్

ఈ ఒప్పందం కారణంగా అమెరికా నుంచి అనే వస్తువులు భారత్‌లోకి దిగుమతి అవుతాయి. దీంతో భారతీయ కంపెనీలు అమెరికా నుంచి వచ్చే నాణ్యమైన ఉత్పత్తులతో పోటీ పడాల్సి ఉంటుంది. అమెరికా కూడా పరస్పర ప్రాతిపదికన కొన్ని రాయితీలను పొందుతుంది కాబట్టి, మన దేశీయ మార్కెట్లోకి వచ్చే అమెరికా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ వినియోగదారులకు లాభం చేకూర్చినప్పటికీ, దేశీయ తయారీదారులు తమ నాణ్యతను పెంచుకుని పోటీని పెట్టుకోవాల్సిన సవాలును ఎదుర్కొంటారు. ముఖ్యంగా విమాన విడిభాగాలు, జెనరిక్ ఫార్మా రంగాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగు పడాల్సి ఉంటుంది.

ధరలు తగ్గే వస్తువులు ఇవే..

భారత్-అమెరికా మధ్యంతర ఒప్పందంతో విమాన విడిభాగాలు, జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలపై సుంకాలు సున్నాకి (Zero) తగ్గనున్నాయి. అలాగే ఎంపిక చేసిన అమెరికన్ యంత్రాలు, ఆటో విడిభాగాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే, రైతుల ప్రయోజనాల దృష్ట్యా పాలు, చీజ్, వరి వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఈ ధరల తగ్గింపు నుండి మినహాయించారు. అలాగే పలు రకాలు మద్యం బ్రాండ్ల ధరలు కూడా తగ్గనున్నాయి.

Next Story