బంగారు పుస్తెల తాడు అపహరణ

by Batti.Sumithra |

కూలీ డబ్బులు తెచ్చుకునేందుకు మనుమరాలితో కలిసి వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెల తాడును శనివారం గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు.

బంగారు పుస్తెల తాడు అపహరణ
X

దిశ, షాద్‌నగర్: కూలీ డబ్బులు తెచ్చుకునేందుకు మనుమరాలితో కలిసి వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెల తాడును శనివారం గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. కేశంపేట ఎస్సై రాజ్‌కుమార్ కథనం ప్రకారం, కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన సామర్ల లక్ష్మి తన మనుమరాలు భవానితో కలిసి గ్రామ శివారులోని ఎస్సీ కాలనీకి నడుచుకుంటూ వెళ్తుండగా, శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో గ్రామ శ్మశానవాటిక సమీపంలో నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు.

బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కొల్లాపూర్ వెళ్లే దారి అడుగుతున్నట్లు నటించి, ఒక్కసారిగా లక్ష్మి మెడలోని బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాగడంతో ఆమె కిందపడిపోయింది. వెంటనే వృద్ధురాలు, ఆమె మనుమరాలు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు దొంగిలించిన బంగారు చైన్‌తో బైక్‌పై మక్తమాదారం వైపు పరారయ్యారు. నిందితులు నలుపు రంగు ఫేస్ మాస్కులు, టీ-షర్టులు ధరించి ఉన్నారని, వారి వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఘటనా స్థలాన్ని షాద్‌నగర్ ఏసీపీ ఎస్. లక్ష్మీనారాయణ పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేశంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story