- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత దాడిలో మేక మృతి.. భయాందోళనలో గ్రామస్థులు
మహమ్మదాబాద్ మండలంలోని ఉమ్మడి నంచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కచెరువు గ్రామంలోని బోయగుడిసెల వద్ద చిరుత సంచారం కలకలం రేపింది.

దిశ, మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలంలోని ఉమ్మడి నంచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కచెరువు గ్రామంలోని బోయగుడిసెల వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. మంగళవారం చిరుత దాడిలో ఓ మేక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. బాధితుడు కుర్మయ్య తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం తన మేకలను సమీప అటవీ ప్రాంతానికి మేత కోసం తీసుకెళ్లాడు. ఈ సమయంలో పొదల్లో దాక్కున్న చిరుత ఒక్కసారిగా బయటకు వచ్చి మేకపై దాడి చేసింది. దీంతో కుర్మయ్య పెద్దగా కేకలు వేయడంతో పాటు అక్కడ ఉన్న కుక్కలు చిరుత పై మొరుగుతూ వెంటపడటంతో అది అడవిలోకి పారిపోయింది.
అయితే అప్పటికే చిరుత దాడికి గురైన మేక తీవ్ర గాయాలపాలై బుధవారం మృతి చెందింది. ఈ ఘటనతో బోయ గుడిసెలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత కొంతకాలంగా అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో చిరుత సంచారం కనిపిస్తోందని, పశువులను మేతకు తీసుకెళ్లడానికే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిరుత సంచారం పై అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని, గ్రామాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేసి ప్రజలు, పశువుల భద్రతకు చర్యలు తీసుకోవాలని బోయగుడిసెల గ్రామస్థులు కోరుతున్నారు.






