రోడ్డుపైనే మేకలు, గొర్రెల సంత.. అండర్ పాస్ కింద నిలిచిపోయిన ట్రాఫిక్

by Jakkula.Mamatha |

హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లి గ్రామ శివారులో శనివారం నాడు ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

రోడ్డుపైనే మేకలు, గొర్రెల సంత.. అండర్ పాస్ కింద నిలిచిపోయిన ట్రాఫిక్
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లి గ్రామ శివారులో శనివారం నాడు ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. హుజూరాబాద్ - పరకాల ప్రధాన రహదారిపై ఉన్న అండర్ పాస్ కింద గొర్రెలు, మేకల వ్యాపారులు రోడ్డుపైనే బహిరంగంగా సంత నిర్వహించడమే ఇందుకు కారణం. ​జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించారు. నిత్యం వందలాది వాహనాలతో బిజీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై, అండర్ పాస్ కింద వ్యాపారులు పదుల సంఖ్యలో ట్రాలీ ఆటోలను నిలిపి గొర్రెలు, మేకల విక్రయాలు సాగించారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు, జీవాలు పేరుకుపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా ద్విచక్ర వాహనదారులు, కారు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

వ్యాపారుల నిర్లక్ష్యం–ప్రయాణికుల ఆగ్రహం..

ప్రధాన రహదారిపై ఇలా సంత నిర్వహించి రాకపోకలకు అంతరాయం కలిగించడం ఏమిటని ప్రయాణికులు, వాహనదారులు వ్యాపారులను నిలదీశారు. అయితే, వ్యాపారులు ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ప్రయాణికులు వాపోయారు. తాము గ్రామ పంచాయతీ నుంచి ముందస్తు అనుమతి తీసుకునే ఇక్కడ అంగడి పెట్టామని, ఇలాగే నిర్వహిస్తామంటూ వ్యాపారులు దురుసుగా సమాధానం ఇవ్వడం గమనార్హం.

మా అనుమతి లేదు: పంచాయతీ కార్యదర్శి

ఈ నిబంధనల ఉల్లంఘనపై 'పెద్ద పాపయ్య పల్లి' గ్రామ పంచాయతీ కార్యదర్శి రామ్‌ని వివరణ కోరగా.. ఆయన ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రధాన రహదారిపై గానీ, అండర్ పాస్ కింద గానీ గొర్రెలు, మేకల సంత నిర్వహించుకోవడానికి గ్రామ పంచాయతీ తరపున ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పంచాయతీ అనుమతి ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సదరు వ్యాపారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.​ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ప్రధాన రహదారులపై ఇలాంటి అక్రమ సంతలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story