తెలంగాణలో గడ్డిమందుపై నిషేధం: జీవో 24 విడుదల.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

by Malleboina Mahesh |

తెలంగాణలో పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం! జీవో 24 తక్షణమే అమలు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. 60 రోజుల పాటు నిఘా పెంచిన వ్యవసాయ శాఖ.

తెలంగాణలో గడ్డిమందుపై నిషేధం: జీవో 24 విడుదల.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!
X

దిశ, నందిపేట : పంట పొలాల్లో కలుపు మొక్కల నివారణకు రైతులు విరివిగా వాడే ఓ ప్రముఖ కంపెనీకి చెందిన గడ్డి మందును రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మందు తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ జీవో నెంబర్ 24 ను విడుదల చేసింది. తక్షణ కలుపు నాశనిగా అందుబాటులో ఉన్న ఈ రసాయనం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడే వారు ఈ మందును తాగి ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

లాభా నష్టాలపై రైతుల్లో చర్చ..

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు గడ్డి మందును విరివిగా వాడుతున్నారు. ఇది తక్కువ ఖర్చుతో గంటల వ్యవధిలోనే కలుపును నిర్మూలించడమే కాకుండా, గట్లపై పెరిగే పిచ్చి మొక్కలను తొలగించి పాములు, తేళ్ల భయం లేకుండా చేస్తుంది. అయితే, దీని విచ్చలవిడి వినియోగం వల్ల కూరగాయలు విషపూరితం కావడమే కాకుండా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. తక్కువ మోతాదులో సేవించినా శరీర అవయవాలు శాశ్వతంగా దెబ్బతింటుండడంతో ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది.

60 రోజుల పాటు నిఘా...

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సదరు కంపెనీ గడ్డి మందు అమ్మకాలపై 60 రోజుల పాటు నిషేధం అమల్లో ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మందును విక్రయించినా? లేదా? నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకుని ప్రభుత్వ నిర్ణయానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ నిషేధం పై ఒకవైపు హర్షం వ్యక్తమవుతుండగా, కలుపు నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు ఖరీదైనవిగా మారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Next Story