గ్లాన్స్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ జియో!

by Web Desk |
గ్లాన్స్‌లో రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన రిలయన్స్ జియో!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వరుస పెట్టుబడులను కొనసాగిస్తోంది. శాటిలైట్ ఇంటర్నెట్ సదుపాయాల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన అనంతరం తాజాగా ఏఐ ఆధారిత సంస్థలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రముఖ ఏఐ ఆధారిత లాక్-స్క్రీన్ ప్లాట్‌ఫామ్ సంస్థ గ్లాన్స్‌లో సుమారు రూ. 1,500 కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించింది. దీనిద్వారా అంతర్జాతీయ మార్కెట్‌పై పట్టు సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఈ పెట్టుబడి తో ఆసియాకు వెలుపల అమెరికా, బ్రెజిల్, మెక్సికో, రష్యా లాంటి గ్లోబల్ మార్కెట్లలో గ్లాన్స్ విస్తరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఉన్నట్టు ఇరు కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. గ్లాన్స్ కంపెనీ సైతం జియో పెట్టుబడులతో అంతర్జాతీయంగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. గడిచిన రెండేళ్ల కాలంలో గ్లాన్స్ కంపెనీ అత్యంత వేగంగా వృద్ధి సాధించింది. ఇంటర్నెట్, కమర్షియల్, గేమింగ్, లైవ్ కంటెంట్ విభాగాల్లో మరిన్ని సేవలను అందించేందుకు వీలవుతుందని జియో ప్లాట్‌ఫామ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు. 'జియో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉంది. భారత్‌లో విస్తరించేందుకు మాత్రమే కాకుండా మరింత సామర్థ్యాన్ని కలిగి ఉండేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పాటు అందిస్తుందని' గ్లాన్స్ సీఈఓ నవీన్ తివారీ వెల్లడించారు.


Next Story

Most Viewed