అమ్మాయిలూ జాగ్రత్త... పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం: సీపీ సజ్జనార్

by Malleboina Mahesh |

"పెళ్లి పేరుతో నయవంచన.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక! వేధింపులు ఎదురైతే షీ టీమ్స్ 9490616555 నంబర్‌కు ఫిర్యాదు చేయండి."

అమ్మాయిలూ జాగ్రత్త... పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం: సీపీ సజ్జనార్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్ అమ్మాయిలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. గత కొద్ది రోజులుగా హైదారబాద్‌లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని. కేవలం ప్రేమ పేరుతోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా కొందరు యువతులను మోసం చేస్తున్నారని గుర్తు చేస్తు హెచ్చరికలతో ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని, ఆపై పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారు. మాయమాటలు చెప్పి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి శారీరకంగా లోబరచుకుని, ఆ తర్వాత తమ అసలు రంగు బయటపెడుతున్నారు. పెళ్లి జరగాలంటే భారీగా డబ్బు, అదనపు కట్నం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతుండటంతో, కేటుగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని పోలీసులు గుర్తించారు. నిశ్చితార్థం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కే వరకు యువతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్స్ సూచిస్తున్నాయి. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ముందే ఆరా తీయాలని, పెళ్లికి ముందే శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే కచ్చితంగా అనుమానించాలని సజ్జనార్ చేసిన ట్విట్‌లో పేర్కొన్నారు.

సహాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు

మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేయండి అని తెలిపారు.

Next Story