స్నానం చేయనందుకు మందలించిన పేరెంట్స్.. బావిలో దూకిన ఇంటర్ విద్యార్ధిని

by Muthe.Rajitha |

స్నానం ఎందుకు చేయలేదని పేరెంట్స్ మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక బావిలోకి దూకడం సంచలనం సృష్టించింది.

స్నానం చేయనందుకు మందలించిన పేరెంట్స్.. బావిలో దూకిన ఇంటర్ విద్యార్ధిని
X

దిశ, వెబ్ డెస్క్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఒక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్నానం ఎందుకు చేయలేదని పేరెంట్స్ మందలించడంతో మనస్తాపానికి గురైన సదరు బాలిక బావిలోకి దూకడం సంచలనం సృష్టించింది. సమయానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని రక్షించడంతో ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్‌నగర్ ప్రాంతానికి చెందిన స్వర్ణలత, పోచీరాం దంపతుల కుమార్తె సాత్విక. ఈమె ఇటీవల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. బుధవారం ఇంట్లో రోజువారీ విషయాల్లో భాగంగా స్నానం చేయమని తల్లిదండ్రులు ఆమెను కాస్త గట్టిగా మందలించారు.

దానికి తీవ్ర మనస్తాపానికి గురైన సాత్విక, ఆవేశంలో పక్కనే ఉన్న వీధిలోని బావిలో దూకి, ప్రాణభయంతో గట్టిగా కేకలు వేసింది. బాలిక కేకలు గమనించిన కాలనీవాసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే '100' నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించి ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది తాడు సహాయంతో బాలికను రక్షించారు. సకాలంలో స్పందించి బాలిక ప్రాణాలు కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని కాలనీ ప్రజలు, ఉన్నతాధికారులు అభినందించగా.. చిన్న విషయానికే బావిలో దూకిన బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Next Story