గాయాల చికిత్సకు హెల్ప్‌ఫుల్‌గా చీజ్ బ్యాక్టీరియా..

by Satheesh |
గాయాల చికిత్సకు హెల్ప్‌ఫుల్‌గా చీజ్ బ్యాక్టీరియా..
X

దిశ, ఫీచర్స్: చీజ్ తయారీకి ఉపయోగపడే బ్యాక్టీరియాను చర్మంపై గాయాలను నయం చేసేలా జన్యుపరంగా అభివృద్ధి చేశారు. దీన్ని ఎలుకల గాయాలపై అప్లయ్ చేసినపుడు స్కిన్ రిపేర్ ప్రోటీన్స్‌ ఉత్పత్తిని వేగవంతం చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులను వేధించే దీర్ఘకాలిక గాయాల చికిత్సకు ఇవి సాయపడతాయో లేదో తెలుసుకునేందుకు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

డయాబెటిక్ పేషెంట్స్‌లో నాలుగోవంతు.. రక్త ప్రసరణ వ్యవస్థలో ఇబ్బందులు, ఇతర సమస్యల వల్ల అల్సర్‌ వంటి నయంకాని పుండ్లతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్ తీవ్రతరమైతే అది మిగతా శరీర భాగాలకు పాకకుండా గాయమైన భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఫిన్‌లాండ్‌లోని 'ఆరియలిస్ థెరప్యూటిక్స్' కంపెనీకి చెందిన జెరె కుర్కిపురో, అతని సహచరులు.. స్కిన్ రిపేర్‌కు సంబంధించిన ప్రోటీన్స్ అందించడం ద్వారా గాయాలను నయంచేసే దిశగా పరిశోధన ప్రారంభించారు. కాగా ప్రోటీన్స్‌ను గాయంపై ఇంజెక్ట్ చేయడానికి బదులు దెబ్బతిన్న కణజాలంపై ఒకసారి అప్లయ్ చేయడం ద్వారా నిరంతరం ప్రోటీన్స్‌ను ఉత్పత్తి చేయగల బ్యాక్టీరియాను జన్యుపరంగా అభివృద్ధి చేయాలనేది వారి ఆలోచన.

ఇందుకోసం చీజ్ మేకింగ్‌లో ఉపయోగించే లాక్టోకోకస్ లాక్టిస్ బ్యాక్టీరియాను ఉపయోగించారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేనందునే దీన్ని ఎంచుకున్నారు. ఈ బ్యాక్టీరియాను జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసినపుడు మూడు స్కిన్ హీలింగ్ ప్రోటీన్స్‌(ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్-2, ఇంటర్‌లుకిన్-4, కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్-1)ను ఉత్పత్తి చేస్తాయి. ఇక ఈ బ్యాక్టీరియాను డయాబెటిక్ అల్సర్‌ వ్యాధిని పోలిన ఎలుక శరీరంపై ఒక సెంటీమీటర్ వెడల్పయిన గాయంపై ప్రయోగిస్తే వారం రోజుల తర్వాత పూర్తిగా నయమైంది.



Next Story

Most Viewed