సింగరేణీయులకు తప్పని గ్యాస్ కష్టాలు

by Batti.Sumithra |

మణుగూరు మండలంలో వంట గ్యాస్ కొరత నెలకొన్న దుస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.

సింగరేణీయులకు తప్పని గ్యాస్ కష్టాలు
X

దిశ, మణుగూరు : మణుగూరు మండలంలో వంట గ్యాస్ కొరత నెలకొన్న దుస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. వంట గ్యాస్ కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ఎదుట తెల్లవారుజాము నుంచే భారీగా పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఇళ్లలో వంట చేసుకునేందుకు గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి కార్మికులు ఒకవైపు విధులు నిర్వహించి ఇంటికి చేరుకున్న తర్వాత కూడా విశ్రాంతి లేకుండా గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. డ్యూటీలు పూర్తి చేసి వచ్చిన తర్వాత కూడా గ్యాస్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, ఈ గ్యాస్ కష్టాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయో తెలియక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని చెబుతున్నప్పటికీ, స్థానిక గ్యాస్ ఏజెన్సీలు మాత్రం తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు 45 రోజులు దాటినా గ్యాస్ సిలిండర్లు బుక్ కాకపోవడంతో వినియోగదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఓటీపీ (OTP) రాకపోవడంతో సిలిండర్ పొందలేకపోతున్నారు. ఓటీపీ వస్తేనే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, లేకపోతే ఇవ్వడం సాధ్యం కాదని గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారని కార్మికులు, మాజీ కార్మికులు వాపోతున్నారు. దీంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీల పై తనిఖీలు నిర్వహించాలని, గ్యాస్ సరఫరాను సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story