జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడి

by Naga Rani Yarlagadda |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Monsoon Session 2026) షెడ్యూల్ ఖరారయింది.

జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Monsoon Session 2026) షెడ్యూల్ ఖరారయింది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీన ప్రారంభమై, ఆగస్టు 13వ తేదీ వరకూ కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. పలు కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వ సిఫార్సు మేరకు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిమిత్తం ఉభయ సభలను ఆహ్వానించేందుకు ఆమోదం తెలిపారు. జులై 20 నుంచి ఆగస్టు 13 వరకూ జరిగే సమావేశాల్లో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. నాలుగు వారాలపాటు సాగే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగ్స్ ఉంటాయని పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి పార్లమెంట్లో పార్టీల బలాబలాలు మారే అవకాశం కనిపిస్తోంది. TMCలో అంతర్గత విభేదాలు, డీఎంకే - కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న దూరం, ఉద్ధవ్ థాకరే శివసేన నుంచి ఎంపీల నిష్ర్కమణ వంటి అంశాలు సభ స్వరూపాన్ని మార్చనున్నాయి. సభలో NDA కూటమి బలం మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండగా.. INDIA కూటమి బలం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు 'NCPI' పార్టీలో విలీనం కావడం, అలాగే ఉద్ధవ్ సేనకు చెందిన ఆరుగురు ఎంపీలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అసలైన శివసేనలో విలీనం అయ్యే అంశాలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

సభ ముందుకు కీలక బిల్లులు:

ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. గత సమావేశాల్లో తిరస్కరణకు గురైన మహిళా రిజర్వేషన్ అండ్ నియోజకవర్గాల పునర్విభజన (131వ రాజ్యాంగ సవరణ బిల్లు)కు కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మంత్రులు, సీఎంల పదవులపై 130వ రాజ్యాంగ సవరణ బిల్లు... అంటే తీవ్రమైన నేరారోపణల కేసుల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, లేదా ప్రధానమంత్రి వరుసగా 30 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ లేదా నిర్బంధంలో ఉంటే.. వారు ఆటోమెటిక్ గా తమ పదవులను కోల్పోయేలా చేసే కీలక బిల్లును కేంద్రం తీసుకురానుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వ ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. FCRA బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, యాంటీ డోపింగ్ బిల్లులతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ఆర్డినెన్స్ స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్, వేతనాల కోడ్ సెంట్రల్ రూల్స్‌కు సంబంధించిన బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి.

Next Story