రాష్ట్రానికి రెడ్ అలర్ట్.. 3వ నెంబర్ హెచ్చరిక జారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-04 11:58:56  IST  )

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం ఇది సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు వెళ్లబోతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది...

రాష్ట్రానికి రెడ్ అలర్ట్.. 3వ నెంబర్ హెచ్చరిక జారీ
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం ఇది సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు వెళ్లబోతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే రానున్న 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. రాజస్థాన్ నుంచి మధ్య ప్రదేశ్ వరకు నైరుతి రుతుపవన ద్రోణి రానున్న మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీని ప్రభావంతో ఏలూరు, అల్లూరి సీతారామ రాజు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని మూర్తి వెల్లడించారు.

ఉత్తర, దక్షిణ కోస్తా తీరంలో..

ఉత్తర, దక్షిణ కోస్తా తీరంలో మరో నాలుగు రోజుల పాటు మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని, మూడు నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల భారీగా వర్షాలు కురిశాయని గరిష్టంగా ఇచ్చాపురంలో 5 సెం.మీ వర్షపాతం, సోంపేటలో 4 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ మూర్తి పేర్కొన్నారు.

Next Story