మొదటిసారి బీటీ పత్తి రకాన్ని విడుదల చేసిన వ్యవసాయ వర్సిటీ

by Taduka Kalyani |

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శనివారం రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయంలోని కిద్వాయ్ కాటేజీ లో మీడియా సమావేశం నిర్వహించారు.

మొదటిసారి బీటీ పత్తి రకాన్ని విడుదల చేసిన వ్యవసాయ వర్సిటీ
X

దిశ, రాజేంద్రనగర్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య శనివారం రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయంలోని కిద్వాయ్ కాటేజీ లో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిలో విశ్వవిద్యాలయం వివిధ పంటలకు సంబంధించి విడుదల చేసిన పన్నెండు కొత్త రకాల గురించి వివరాలు వెల్లడించారు. దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా బీటీ పత్తి రకం (డబ్ల్యూజీసీవీ బీటీ 28) అనే నూతన రకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన కమిటీ ఆమోదం తెలిపిందని జానయ్య తెలిపారు. ఈ బీటీ పత్తి రకం దక్షిణాది రాష్ట్రాలలో సాగు కి మంచి అనుకూలమైనదని కేంద్ర కమిటీ నిర్ధారించిందని ఆయన పేర్కొన్నారు. బీటీ పత్తి విత్తన రంగంలో గత 20 ఏళ్ళుగా గా ప్రైవేటు సంస్థల ఆధిపత్యానికి విశ్వవిద్యాలయం రూపొందించిన ఈ కొత్త రకంతో కొంత అడ్డుకట్ట వేయవచ్చని ఆయన తెలిపారు. అదే విధంగా ఈ విత్తన రకం సాగు వల్ల ఎకరానికి సుమారు నాలుగు, ఐదు వేల రూపాయల విత్తనం పై పెట్టే ఖర్చు తగ్గుతుందని జానయ్య తెలిపారు. అంతే కాకుండా రైతులు తమ విత్తనాల్ని తామే మరలా విత్తుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వివిధ పంటలకి చెందిన మరో 11 నూతన రకాలకి కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ఇటీవల విడుదలకు ఆమోదం తెలిపిందని అల్దాస్ జానయ్య తెలిపారు. ఆరు వరి రకాలు, మొక్క జొన్న, సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము పంటలకి సంబంధించిన ఒక్కొక్కటికీ ఆమోదం లభించిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ కొత్త రకాలకు సంబంధించిన విత్తనోత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకుని వస్తామని అల్దాస్ జానయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠీ బలరాం, ఈ పంట రకాల అభివృద్ధిలో పాలు పంచుకొన్న శాస్త్రవేత్తలు డా. ప్రశాంత్, డా. శ్రీధర్ సిద్ధి, డా. శ్రావణిలతో పాటు విశ్వవిద్యాలయ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Next Story