పాతాళగంగ నదిలో కొట్టుకు పోయిన 5 వేల సిలిండర్లు

by Muthe.Rajitha |

మహారాష్ట్రలోని ఖపోలి ప్రాంతంలో పాతాళగంగ నదిలో వేల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకురావడం సంచలనం రేపుతోంది.

పాతాళగంగ నదిలో కొట్టుకు పోయిన 5 వేల సిలిండర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలు ఊహించని ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. పూణే, సూరత్ పరిసర ప్రాంతాల తర్వాత ఇప్పుడు రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి (Khopoli) ప్రాంతంలో ఒక మైండ్ బ్లోయింగ్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రవహించే పాతాళగంగ నది (Patalganga River) భారీ వర్షాల కారణంగా ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయితే, ఈ ఉధృత వరద ప్రవాహంలో వందలు, వేల సంఖ్యలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు (Gas Cylinders) నీటిపై తేలుతూ కొట్టుకురావడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వరదలో కొట్టుకు వచ్చిన సిలిండర్ల కోసం అక్కడి స్థానికులు ప్రాణాలకు తెగించి ఎగబడటం మరింత సంచలనం రేపింది.

ఐదు వేలకు పైగా సిలిండర్లు?

ఖోపోలి సమీపంలోని ఒక గ్యాస్ ఏజెన్సీ గోదాంలోకి వరద నీరు భారీగా చేరడంతో అక్కడ నిల్వ ఉంచిన సిలిండర్లన్నీ వరద తాకిడికి నదిలోకి కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు 5,000 నుండి 6,000 గ్యాస్ సిలిండర్లు ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై గ్యాస్ కంపెనీల నుండి కానీ, స్థానిక ప్రభుత్వ అధికారుల నుండి కానీ కచ్చితమైన సంఖ్యపై అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. నదీ పాయల్లో ఎటు చూసినా సిలిండర్లు నీటిపై తేలుతూ కొట్టుకుపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

హెచ్చరికలు జారీ

ఈ సిలిండర్లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడం వల్ల లేదా ఒడ్డున ఉన్న రాళ్లకు తగలడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పాతాళగంగ నదీ పరివాహక ప్రాంతాలు, ఒడ్డున ఉన్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Next Story