చెత్తాచెదారం.. అంటువ్యాధుల భయం: నరకప్రాయంగా మారిన జమ్మికుంట వీధులు

by Malleboina Mahesh |

జమ్మికుంటలో పడకేసిన పారిశుధ్యం; నివాసాల మధ్యే చెత్త కుప్పలు. వసూళ్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏది? రోగాల భయంతో వణుకుతున్న పట్టణ ప్రజలు.

చెత్తాచెదారం.. అంటువ్యాధుల భయం: నరకప్రాయంగా మారిన జమ్మికుంట వీధులు
X

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ అట్టడుగు స్థాయికి పడిపోయింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యం పట్టణాన్ని రోగాల నిలయంగా మారుస్తోంది. ప్రతి వీధిలోనూ చెత్త కుప్పలు దర్శనమిస్తుండడంతో స్థానికులు అంటువ్యాధుల భయంతో వణికిపోతున్నారు. పన్నుల వసూళ్ల పై ఉన్న శ్రద్ధ కనీస సౌకర్యాల కల్పనపై లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది. స్కూళ్లు, ప్రార్థనా స్థలాల వద్దే చెత్తను పారబోస్తుండడంతో జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలకవర్గం తమ సమస్యలు తీరుస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది.

దిశ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. డంపింగ్ యార్డుకు వెళ్లాల్సిన చెత్తను నివాస ప్రాంతాల మధ్యే పారబోస్తుండడంతో పట్టణం రోగాల పుట్టగా మారుతోంది. ముఖ్యంగా పాఠశాలల ముందు, కెనాల్ కాలువల పైన, మసీదుల పక్కన, ఆహార గోదాముల సమీపంలోనే చెత్తను పారబోయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట గా మారింది. ఈ ప్రాంతాలన్నీ దుర్వాసనతో నిండిపోయి ఈగలు, దోమలకు ఆవాసాలుగా మారాయి. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పు రావడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఏ వార్డు చెత్తను ఆ వార్డు చివరనే వేసి అధికారులు బాధ్యత తీర్చుకుంటున్నారు.

అభివృద్ధిని గాలికొదిలేసిన పాలకవర్గం..

కొత్త పాలకవర్గం వచ్చాక సమస్యలు తీరుతాయని ఆశించిన జమ్మికుంట ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. 30 వార్డుల్లో సమస్యలు గుట్టల్లా పేరుకుపోతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును ఎలా రాబట్టుకోవాలన్న ధ్యాస తప్ప, పట్టణాభివృద్ధిపై పాలకవర్గానికి పట్టింపు లేదని విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధిని గాలికొదిలేసి స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని పట్టణవాసులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ తీరుతో సామాన్య ప్రజలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.

పన్నుల వసూళ్లలో వేగం.. పనుల్లో నత్తనడక

‘వసూళ్లు ఫుల్.. అభివృద్ధి నిల్’ అన్న చందంగా మున్సిపల్ అధికారుల తీరు ఉంది. ఇంటి పన్నులు వసూలు చేయడంలో చూపించే ఉత్సాహం పారిశుధ్య పనులపై చూపకపోవడం గమనార్హం. గతంలో అధికారుల తనిఖీల్లో బిల్లుల అక్రమాలు బయటపడినా తీరు మారకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం సమన్వయంతో వ్యవహరించి చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిర్లక్ష్యం వీడకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

Next Story