- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి ముఠా గుట్టురట్టు
ఒడిశా నుంచి గంజాయి, వీడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు.

దిశ, నల్లగొండ క్రైమ్: ఒడిశా నుంచి గంజాయి, వీడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ఎంఎల్ వీడ్(హాష్)ఆయిల్, 5 బైక్‌లు, 4 సెల్‌ఫోన్లు, డమ్మీ తుపాకీ, బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ శివరాం రెడ్డి ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు నల్లగొండ పట్టణంలోని మునుగోడు బైపాస్ రోడ్డులోని ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొంతమంది యువకులు గుమిగూడి గంజాయిని విక్రయిస్తూ, వినియోగిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన 8 మంది తో పాటు, ఒక మైనర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో వారు తాము చేస్తున్న నేరాన్ని ఒప్పుకున్నారు.
ప్రధాన నిందితులైన కస్పరాజు నాగరాజు, గంటెకంపు మధు గతంలోనే 15 కేసుల్లో నిందితులుగా ఉండి, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పెండ్ర వాసు, హరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత జూన్ 29న నిందితులు బైక్‌లపై ఒడిశాలోని పసుపులంక గ్రామం వెళ్లే సమయంలో, మార్గమధ్యలో ఖమ్మం జిల్లా ఏక్నూర్ వద్ద ఒక యాక్టివా బైక్‌ను దొంగిలించారు. అనంతరం ఒడిశాలోని ప్రధాన సరఫరాదారు మనుకర్ వద్దకు వెళ్లి ఇప్పటికే హైదరాబాద్‌లో దొంగిలించిన రెండు బైక్‌లను బదులుగా ఇచ్చి రూ.90 వేల విలువైన 12 కిలోల గంజాయి, రూ.లక్ష విలువైన 500 ఎంఎల్ వీడ్ (హాష్) ఆయిల్ కొనుగోలు చేశారు. వచ్చిన తర్వాత గంజాయి, హాష్ ఆయిల్‌ను ముఠా సభ్యులు తమలో తాము పంచుకొని, కొంత భాగాన్ని స్వయంగా వినియోగించారు. మిగిలిన గంజాయిని ఈ నెల 24న నల్లగొండకు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, కళాశాల విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
విచారణలో నిందితులు, తమ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునేవారు ఎదురైతే భయపెట్టేందుకు ఒక డమ్మీ తుపాకీని అవసరమైతే దాడి చేసేందుకు ఒక బటన్ చాకును వెంట తీసుకెళ్లేవారని ఒప్పుకున్నారు. ఈ విధంగా బైక్ దొంగతనాలు, గంజాయి స్మగ్లింగ్, చిన్న ప్యాకెట్లుగా విక్రయించడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తూ తమ మత్తు వ్యసనాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సమయంలో వారిపై దాడి చేసిన నల్గొండ వన్‌టౌన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఛేదించిన వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ ముత్తయ్య, సంపత్, సిబ్బంది శ్రీనివాస్, శేఖర్, రబ్బాని, శంకర్, ఆంజనేయులు, అంజద్, కిరణ్, అంజయ్య, మహేష్‌లను ఎస్పీ అభినందించారు.






