సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ..!

by Ratna Kumari |

"మీపై ఏసీబీ కేసు నమోదైంది... వెంటనే మాట్లాడాలి... లేకుంటే అరెస్ట్ తప్పదు..." అంటూ వచ్చే ఫోన్ కాల్స్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త ఆయుధంగా మారుతున్నాయి.

సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ..!
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : "మీపై ఏసీబీ కేసు నమోదైంది... వెంటనే మాట్లాడాలి... లేకుంటే అరెస్ట్ తప్పదు..." అంటూ వచ్చే ఫోన్ కాల్స్ ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త ఆయుధంగా మారుతున్నాయి. భయం, ఆందోళనను ఆసరాగా చేసుకుని ప్రజల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతుండగా, తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇలాంటి మోసం జరిగినట్లు సమాచారం. సిరిసిల్లకు చెందిన ఓ విద్యుత్ శాఖ ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము ఏసీబీ అధికారులమని పరిచయం చేసుకుని, నీపై అవినీతి కేసు నమోదైందని, కావాలంటే మీ ఇంటి ముందు పోలీసు వాహనం ఆగి ఉందని బెదిరించినట్లు తెలిసింది. మొదట రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వారు, చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. కాగా ఆ ఉద్యోగి రూ. 1.50 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి పంపినట్లు తెలిసింది. అనంతరం మోసపోయానని గుర్తించిన బాధితుడు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

భయమే నేరగాళ్ల పెట్టుబడి..

సైబర్ మోసగాళ్లు అధికారుల పేర్లు, శాఖల పేర్లు, నకిలీ ఐడీ కార్డులు, వీడియో కాల్స్, పోలీస్ లోగోలు ఉపయోగిస్తూ బాధితులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. "ఇప్పుడే డబ్బులు చెల్లిస్తే కేసు నుంచి బయటపడతారు" అని నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖ కూడా ఫోన్‌లో డబ్బులు డిమాండ్ చేయదు. భయపడి వెంటనే డబ్బులు పంపించవద్దు. అయితే ఆ ఉద్యోగి సైబర్ నేరగాళ్లకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. కాగా ఎంతో కొంత అవినీతికి పాల్పడిందే సైబర్ మీరు వాళ్లకు ఇలా డబ్బులు పంపిస్తాడంటూ జిల్లాలో చర్చ కొనసాగుతోంది.

Next Story