- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చూసి రాయడం హైడ్రోజన్, ఆటం బాంబు కంటే డేంజర్ : సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి
ప్రజాగాయకుడు, విప్లవ సాంస్కృతిక యోధుడు, ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు.

దిశ, రాంనగర్ : ప్రజాగాయకుడు, విప్లవ సాంస్కృతిక యోధుడు, ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు పి. వేణు అధ్యక్షత వహించారు. వక్తలుగా ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, సతీష్ చందర్, అరుణోదయ విమలక్క, ప్రొఫెసర్ వినయ్ బాబు తదితరులు పాల్గొని ప్రజల్లో ఆయన అంకితభావం, ఉద్యమ పాటల ప్రాముఖ్యాన్ని స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల కళాకారులచే కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ అరుణోదయ నాగన్న ప్రజల కోసం, వారి ఆశయాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పరీక్షల్లో చూసి రాయడం అనేది రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ లోని నాగసాకి పై వేసిన హైడ్రోజన్, ఆటం బాంబు కంటే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. నీట్ పరీక్షలో చూసి రాయడం, ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగడం వల్ల సోనం వాంగ్ చుక్ నాయకత్వంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారని, జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇది విద్యార్థుల నిబద్ధతకు, నిజాయితీకి నిదర్శనమని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు సరిగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాలు స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండాలని, నిజాయితీగా పరీక్షలు రాసి పాసైన వారు తమ జ్ఞానంతో దేశ మానవ వనరులను అభివృద్ధి చేస్తారని అన్నారు. అలా కాకుండా చూసి రాసి పాసై డాక్టర్, ఇంజనీర్ అయితే నిర్మించిన బ్రిడ్జిలు కూలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని కమ్యూనిస్టు పార్టీలన్నీ చీలికలతో ముక్కలు ముక్కలయ్యాయని, కార్ల్ మార్క్స్ చెప్పినట్లుగా "ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప ఏమీ లేదు" అనే నినాదంతో కమ్యూనిస్టులందరూ ఒకే జెండా కిందకు వచ్చి పిడికిలి ఎత్తితే ఎర్రకోట పై ఎర్రజెండా ఎగురుతుందని ఆయన అన్నారు. అప్పుడే రాజ్యాంగ ఉల్లంఘనలు ఆగుతాయని, ప్రశ్నాపత్రాల లీకేజీలు ఉండవని, ప్రజల సంపద, మూలవాసుల సహజ వనరులు కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా కమ్యూనిస్టులు అందరూ ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వేములపల్లి వెంకటరామయ్య, ఉదయగిరి, కె.గోవర్ధన్, సన్నశెట్టి రాజశేఖర్, రాష్ట్ర పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి నాగరాజు, మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.






