తొలి ఏకాదశి వేళ నాగార్జునసాగర్‌కు పోటెత్తిన భక్తజనం

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-25 12:16:40  IST  )

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగార్జునసాగర్ భక్తజనసందోహంతో కళకళలాడింది.

తొలి ఏకాదశి వేళ నాగార్జునసాగర్‌కు పోటెత్తిన భక్తజనం
X

దిశ, నాగార్జునసాగర్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగార్జునసాగర్ భక్తజనసందోహంతో కళకళలాడింది. ఈ ఏడాది తొలి ఏకాదశి శనివారం రావడంతో సాగర్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది తీరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా, రద్దీ కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు పెరిగాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సాగర్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు.

హిల్ కాలనీలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. 300 మందికి పైగా దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మంచికంటి కిషోర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ఇదిలా ఉండగా.. నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవడంతో కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. నదిలో లోతైన ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు. ఏకాదశి సందర్భంగా సాగర్‌కు పెద్దఎత్తున భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో బుద్ధవనం, లాంచీ స్టేషన్, ప్రధాన జల విద్యుత్ కేంద్రం, కొత్త వంతెన తదితర పర్యాటక ప్రాంతాలు సందడిగా మారాయి. మొత్తం మీద తొలి ఏకాదశి వేడుకలతో నాగార్జునసాగర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Next Story