విద్యార్థి ప్రశ్న.. ఓ గ్రామాన్నే మార్చేసింది..

by Sujitha Rachapalli |

ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే.. మనం బడిలో నేర్చుకున్న టెక్స్ట్ బుక్స్ పాఠాలు బయటి ప్రపంచంలో అప్లయ్ చేయలేము. అసలు ఉపయోగపడుతాయా లేదా అనేది చాలా మంది విద్యార్థుల్లో మెదిలే ప్రశ్న.

విద్యార్థి ప్రశ్న.. ఓ గ్రామాన్నే మార్చేసింది..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే.. మనం బడిలో నేర్చుకున్న టెక్స్ట్ బుక్స్ పాఠాలు బయటి ప్రపంచంలో అప్లయ్ చేయలేము. అసలు ఉపయోగపడుతాయా లేదా అనేది చాలా మంది విద్యార్థుల్లో మెదిలే ప్రశ్న. ఇదే క్వశ్చన్‌ను బయోటెక్నాలజీ ప్రొఫెసర్‌ను ఓ విద్యార్థి అడగ్గా.. ఆమె నిర్ణయం ఓ గ్రామాన్ని జీరో వేస్ట్ విలేజ్‌గా మార్చేసింది.

బయోటెక్నాలజీ ప్రొఫెసర్ డా. సుదీప్తి అరోరా (IIT రూర్కీ నుంచి PhD) క్లాస్ తీసుకుంటూ ఉండగా.. ఒక విద్యార్థి అడిగిన క్వశ్చన్‌ ఆమెను తీవ్రంగా ఆలోచింపజేసింది. ‘మేడం.. మీరు చెప్తున్నది టెక్స్ట్‌బుక్స్‌కు వరకు మాత్రమేనా.. ఇవి బయట ప్రపంచంలో ఉపయోగపడతాయా?’ అని అడిగాడు ఆ స్టూడెంట్. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆమె ల్యాబ్‌ను వదిలి రాజస్థాన్‌లోని ఆంధి గావ్‌కు వెళ్లింది. వ్యవహారిక పరిష్కారాలతో గ్రామ జీవితాన్ని మెరుగుపరచాలని నిర్ణయించుకుంది. గ్రామాన్ని పూర్తి జీరో వేస్ట్‌గా మార్చడానికి ప్రణాళిక రూపొందించి.. రూ. 2 కోట్ల గ్రాంట్ పొందింది. ఆ ఫండింగ్ అనుమతి వచ్చిన అదే రోజు ఆమెకు స్టేజ్-2 క్యాన్సర్ నిర్ధారణ అయింది. అయినా పట్టువదలని సైంటస్ట్ డా. సుదీప్తి కీమో థెరపీ చేయించుకుంటూ ఈ ప్రాజెక్టును కొనసాగించింది.

వ్యర్థం ఏదీ వృథా కాకుండా...

ఆమె మొదటి పరిష్కారం పేటెంట్ పొందిన వెర్మిఫిల్ట్రేషన్ టెక్నాలజీ. వానపాములు, గ్రావెల్ లేయర్లు, సోలార్ పంపులతో కూడిన ఈ వ్యవస్థ వంటగది, బాత్‌రూమ్ వ్యర్థ నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి ఉపయోగపడేలా చేస్తుంది. గ్రామ పాఠశాల కూడా ఈ కార్యక్రమంలో భాగమైంది. గతంలో డస్ట్ బిన్‌లో వేసే ఆహార వ్యర్థాలను ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్లో వేసి.. పాఠశాల వంటగదికి ఇంధనం సరఫరా చేస్తున్నారు.

మలిన నీరు శుద్ధి చేసి..

ఆంధి గ్రామానికి మొదటిసారి వెళ్లినప్పుడు సుదీప్తి అక్కడ అసలు ఏం జరుగుతుందో గమనించింది. ఊరి నుంచి వెళ్లే సుమారు 80% మలిన నీరు నీటి వనరుల్లోకి వదిలేస్తున్నారని గుర్తించింది. దాన్ని పరిష్కరించడానికి 20 KLD కన్‌స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. మొక్కల సహాయంతో మలిన నీటిని శుద్ధి చేసి స్థిరమైన వ్యవసాయానికి ఉపయోగించడం మొదలుపెట్టింది.

జీరో వేస్ట్ విలేజ్

ఇప్పుడు ఆంధి గావ్ పూర్తి జీరో వేస్ట్ స్వయం సమృద్ధి గ్రామంగా ఎదిగింది. ప్రతి ఇంట్లో వ్యర్థాలను వేరు చేసి, వంటగది వ్యర్థాలను కంపోస్ట్ చేస్తారు. నీటిని శుద్ధి చేసి మళ్లీ ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యర్థాలు మట్టికి తిరిగి వెళ్తాయి. గ్రామం నుంచి బయటకు వ్యర్థం దాదాపు ఏమీ వెళ్లదు. మొత్తానికి ఒక విద్యార్థి ప్రశ్నతో మొదలైన ఈ ప్రయాణం.. సంకల్పం, సమూహ ప్రయత్నాలతో ఒక గ్రామ జీవన విధానాన్ని మార్చేసింది.

Next Story