సాగుబడిలో మానుకోట కలెక్టర్ స్నేహ శబరీష్

by Ratna Kumari |

జిల్లా పరిపాలనలో బిజీగా ఉంటూనే రైతులతో మమేకమై వ్యవసాయ పనుల్లో పాల్గొని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సాగుబడిలో మానుకోట కలెక్టర్ స్నేహ శబరీష్
X

దిశ, మరిపెడ : జిల్లా పరిపాలనలో బిజీగా ఉంటూనే రైతులతో మమేకమై వ్యవసాయ పనుల్లో పాల్గొని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు పంట మార్పిడి, లాభదాయక పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ శనివారం మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో రైతులకు పంట మార్పిడిపై సూచనలు ఇచ్చిన అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రామ శివారులోని రైతు బదావత్ వీరన్న పొలం వద్ద ఆగిన కలెక్టర్, పెసర పంట సాగు గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుతో కలిసి స్వయంగా పెసర విత్తనాలను చల్లుతూ కొంతసేపు వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులతో మమేకమైన కలెక్టర్ సాగు విధానాలు, పంటల పరిస్థితి, వర్షాల ప్రభావం, విత్తనాల లభ్యత తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకుని పంట మార్పిడి ద్వారా అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా పొలంలోకి దిగి రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొనడం స్థానిక రైతులను ఆనందానికి గురిచేయగా, ఆమె చర్యను పలువురు అభినందించారు.

Next Story