గంభీర్ 'మాస్టర్ ప్లాన్'.. టీమ్ ఇండియా స్పిన్ కోచ్‌గా సైరాజ్ బహుతులే!

by Malleboina Mahesh |

టీమ్ ఇండియా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సైరాజ్ బహుతులే రాక దాదాపు ఖాయమైంది. అపార కోచింగ్ అనుభవం ఉన్న ఆయనను స్పిన్ విభాగానికి గురువుగా నియమించాలని గౌతమ్ గంభీర్ కోరడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

గంభీర్ మాస్టర్ ప్లాన్.. టీమ్ ఇండియా స్పిన్ కోచ్‌గా సైరాజ్ బహుతులే!
X

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా స్పిన్ కోచ్‌గా సైరాజ్ బహుతులే (Sairaj Bahutule) నియామకం ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. 53 ఏళ్ల సైరాజ్ బహుతులే ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన రాజస్థాన్ రాయల్స్, కేరళ, బెంగాల్, విదర్భ వంటి జట్లకు కోచ్‌గా పనిచేసిన అపార అనుభవం ఉంది. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో కూడా స్పిన్ బౌలింగ్ కోచ్‌ (Spin bowling coach)గా పనిచేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియాలో బ్యాటింగ్ కోచ్‌గా సీతాన్షు కోటక్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ ఉండగా, స్పిన్ విభాగానికి ప్రత్యేక కోచ్ లేని లోటును బహుతులే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్ నుండి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. భారత టెస్ట్ జట్టులో దిగ్గజ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ (రిటైర్డ్), రవీంద్ర జడేజాల వారసులను సిద్ధం చేయడం బహుతులే ముందున్న ప్రధాన లక్ష్యం. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వంటి ప్రస్తుత స్పిన్నర్ల నైపుణ్యాలను మెరుగుపర్చడం తో పాటు, దేశీయ క్రికెట్ నుండి కొత్త టాలెంట్‌ను వెలికితీయడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. ముంబైలో జన్మించిన బహుతులే భారత్ తరపున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడినప్పటికీ.. దేశీయ క్రికెట్‌లో 630 వికెట్లు, 6,000 పైగా పరుగులు చేసి ఆల్ రౌండర్‌గా అద్భుత రికార్డును కలిగి ఉన్నారు.

Next Story