AI సమ్మిట్‌లో చైనా రోబో వివాదంపై గల్గోటియాస్ ప్రొఫెసర్ నేహా సింగ్ వివరణ

by Malleboina Mahesh |   (  Updated:2026-02-18 10:15:48  IST  )

రోబో కుక్క వివాదంపై గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ క్లారిటీ ఇచ్చారు. 'ఓరియన్' ఆవిష్కరణ కాదు. కేవలం టీచింగ్ టూల్ మాత్రమే. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే వివాదం అని ప్రొఫెసర్ నేహా వివరణ.

AI సమ్మిట్‌లో చైనా రోబో వివాదంపై గల్గోటియాస్ ప్రొఫెసర్ నేహా సింగ్ వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని 'భారత్ మండపం' (Bharat Mandapam) లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్ లో చైనా రోబో అంటూ వివాదం నెలకొంది. దీనిపై ఎల్‌వోపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏఐ సమ్మిట్ కేవలం ఒక పబ్లిక్ రిలేషన్స్ (PR) ప్రదర్శనగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ సమ్మిట్‌లో చైనాకు చెందిన రోబోలను భారతదేశ సొంత ఉత్పత్తులుగా ప్రదర్శించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దేశానికి తీరని అవమానమని, చైనా మీడియా కూడా ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ భారతదేశాన్ని ఎగతాళి చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఏఐ సమ్మిట్‌లో చైనాకు చెందిన 'Unitree Go2' రోబోను తమ స్వంత ఆవిష్కరణ 'ఓరియన్' (Orion) గా ప్రదర్శించారనే ఆరోపణలపై గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ వివరణ ఇచ్చారు. ఇదంతా కేవలం ఒక 'అపార్థం' (Misinterpretation) వల్ల జరిగిన వివాదమని, తాను ఉత్సాహంలో చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేకపోయి ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. తాను మేనేజ్మెంట్ స్కూల్‌లో కమ్యూనికేషన్స్ ఫ్యాకల్టీని తప్ప, ఏఐ నిపుణురాలిని కాదని, రోబోను కేవలం విద్యార్థుల రీసెర్చ్, ప్రొజెక్షన్ కోసమే ప్రదర్శనకు ఉంచామని స్పష్టం చేశారు.

ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తమను ఎగ్జిబిషన్ నుండి వెళ్ళిపోమని (Vacate) ఆదేశించినట్లు వస్తున్న వార్తలను యూనివర్సిటీ తోసిపుచ్చింది. తమకు ఇంకా ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదని, యూనివర్సిటీ బాధ్యతాయుతమైన సంస్థగా ఎప్పుడూ దేశ ప్రతిష్టను పెంచడానికే కృషి చేస్తుందని ప్రొఫెసర్ నేహా వెల్లడించారు. గల్గోటియాస్ ఇప్పటికే దేశానికి పారాలింపియన్లను ఇచ్చిందని, విద్యార్థులను భవిష్యత్తు సాంకేతికతకు సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆమె గుర్తు చేశారు.

అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఆ రోబోను తమ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' అభివృద్ధి చేసిందని ఆమె చెప్పడం వల్ల ఈ వివాదం ముదిరింది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ.. రోబో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న పరికరాలను వాడుకోవడంలో తప్పులేదని, కానీ ఆ రోబోను తామే తయారు చేశామని ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదని పేర్కొంది.

కుంగ్‌ఫూ విన్యాసాలతో అదరగొట్టిన చైనీస్ రోబోలు

ఏఐ సమ్మిట్‌లో చైనా రోబోల ప్రదర్శన.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు

Next Story