- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాయిని చెరువు సుందరీకరణ ముసుగులో నిధులు స్వాహా
నాయిని చెరువు సుందరీకరణ ముసుగులో భారీ అవినీతి! 80 ఎకరాల చెరువు కబ్జా.. అధికారుల అండతోనే అక్రమ కట్టడాలంటూ ప్రజాసంఘాల ఆగ్రహం.

దిశ, జమ్మికుంట : భూగర్భ జలాలను కాపాడాల్సిన జమ్మికుంట లోని చారిత్రాత్మక నాయిని చెరువు నేడు రాజకీయ నాయకుల అండతో సాగుతున్న అక్రమార్కుల చెరలో చిక్కుకుంది. సర్వే నెంబర్ 865 లో సుమారు 289 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ జలవనరు, ప్రస్తుతం ఆక్రమణల పర్వంతో కుంచించుకుపోతోంది. ప్రస్తుతం ఈ చెరువు 80 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. అభివృద్ధి పేరిట సాగుతున్న నాణ్యత లేని పనులు, తడిసి మోపెడవుతున్న బిల్లులు చూస్తుంటే.. ఇది 'సుందరీకరణ' కాదు, నిధులను కొల్లగొట్టే 'బకాసుర' పని అని ప్రజలు ముక్తకంఠంతో గర్జిస్తున్నారు.
హద్దులు చెరిపేసి..
చెరువు విస్తీర్ణంలో ఇప్పటికే సుమారు 30 శాతం భూమి అక్రమార్కుల పాలు కావడం గమనార్హం. చెరువు శిఖం భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉన్న రెవెన్యూ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. విస్తుపోయే విషయం ఏమిటంటే.. చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లకు, మిల్లులకు, గోదాములకు, ఫంక్షన్ హాల్ కు, ప్రార్థన మందిరాలకు యథేచ్ఛగా ఇంటి నెంబర్లు కేటాయించడం, నల్లా కనెక్షన్లు ఇవ్వడం, విద్యుత్ సరఫరా కల్పించడం వెనుక అధికారుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది రైతులు కూడా చెరువు శిఖం భూమిని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి ఆక్రమణదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి.
పని తక్కువ.. బిల్లుల ఎక్కువ..
"చారాన కోడికి బారాన మసాలా" అన్న చందంగా నాయిని చెరువులో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. సుందరీకరణ, ఆట స్థలాలు, హరితహారం అంటూ కాగితాల మీద కోట్లు కుమ్మరిస్తున్న, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. కాంట్రాక్టర్లు తమ స్వలాభం కోసం నాసిరకం మెటీరియల్‌తో పనులు ముగిస్తున్నారు. అధికారులతో కుమ్మక్కై కొందరు నాయకులు, నాసిరకం పనులు చేసి భారీ ఎత్తున బిల్లులు డ్రా చేసుకుంటూ ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. చెరువు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పాల్సింది పోయి, అది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది.
చెరువు గత కాలపు జ్ఞాపకమే అవుతుంది..
అధికారుల నిర్లక్ష్యం, నాయకుల ధన దాహం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నాయిని చెరువు కేవలం రికార్డులకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ అధికారులు, స్పందించి,తక్షణమే చెరువు భూములను సర్వే చేయించి, హద్దులు నిర్ణయించాలని.. అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి జలవనరును కాపాడాలని జమ్మికుంట ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి."నిధులు మాయం చేస్తున్నారు. నీటి వనరును మింగేస్తున్నారు. నాయిని చెరువును కాపాడలేకపోతే రేపటి తరానికి కన్నీళ్లే మిగులుతాయని, ఇప్పటికైనా విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






