మేడారంలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

by Malleboina Mahesh |

సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల మొక్కులు ఊపందుకున్నాయి. అమ్మవార్లకు 'నిలువెత్తు బంగారం' (బెల్లం) సమర్పించడంతో పాటు, మేకలు, కోళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ.

మేడారంలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు
X

దిశ, మేడారం న్యూస్ నెట్‌వర్క్: సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల మొక్కులు ఊపందుకున్నాయి. అమ్మవార్లకు 'నిలువెత్తు బంగారం' (బెల్లం) సమర్పించడంతో పాటు, మేకలు, కోళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. దీంతో మేడారం పరిసరాల్లో గొర్రెలు, మేకలు, కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ధరలను అమాంతం పెంచేయడంతో సామాన్య భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎదురు కోళ్లు.. భారీ ధరలు..

అమ్మవార్లు గద్దెలకు చేరే సమయంలో వారిని శాంత పరిచేందుకు భక్తులు కోళ్లను గాలిలోకి ఎగురవేస్తూ 'ఎదురు కోళ్లు' ఇస్తుంటారు. ఈ క్రమంలో కోళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. సాధారణంగా కిలో రూ. 200 నుంచి రూ. 250 ఉండే కోడి మాంసం ధర, జాతరలో రూ. 350 నుంచి రూ. 400 వరకు పలుకుతోంది. ఇక మేకలు, గొర్రెల పరిస్థితి కూడా అలాగే ఉంది. సాధారణ రోజుల్లో రూ. 7 వేల నుంచి రూ. 8 వేల వరకు పలికే మేక పోతులు, ప్రస్తుతం రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే వాటి ధరలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, మొక్కుబడి తీర్చుకోవాలనే ఉద్దేశంతో భక్తులు తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. జాతర ముగిసే వరకు ఈ ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

Next Story