డిండి నుంచి భారత జట్టుకు.. ఆసియా అథ్లెటిక్స్‌లో మెరవనున్న ప్రవళిక

by Batti.Sumithra |

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన యువ అథ్లెట్ నారిమళ్ళ ప్రవళిక చైనాలో జరగనున్న ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత రిలే జట్టుకు ఎంపిక కావడం పట్ల దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హర్షం వ్యక్తం చేశారు.

డిండి నుంచి భారత జట్టుకు.. ఆసియా అథ్లెటిక్స్‌లో మెరవనున్న ప్రవళిక
X

దిశ, డిండి(గుండ్లపల్లి) : నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన యువ అథ్లెట్ నారిమళ్ళ ప్రవళిక చైనాలో జరగనున్న ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత రిలే జట్టుకు ఎంపిక కావడం పట్ల దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను అభినందిస్తూ తన సొంత నిధుల నుంచి రూ.1 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రోత్సాహకంగా అందజేశారు. సాధారణ కూలీ కుటుంబానికి చెందిన ప్రవళిక తల్లిదండ్రులు తాపీ మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నప్పటికీ, తమ కుమార్తె ప్రతిభను గుర్తించి క్రీడల్లో ప్రోత్సహించి జాతీయ స్థాయికి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కష్టపడి సాధన చేసి దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకోవడం ప్రతి యువతకు ఆదర్శమని కొనియాడారు.

ప్రస్తుతం డిండి మండల కేంద్రంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ (బాలికల) పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ప్రవళిక తన ప్రతిభతో అంతర్జాతీయ వేదిక పై పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవడం జిల్లా ప్రజలకు గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రవళిక అభివృద్ధికి కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యాసంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో రాణించే అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చైనాలో జరిగే పోటీల్లో ప్రవళిక అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారతదేశానికి పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Next Story