- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్వాస ఆగదు.. మాట రాదు: 13 ఏళ్ల నరకం నుండి కారుణ్య మరణం వైపు.. ఎయిమ్స్‌కు హరీష్ రాణా
13 ఏళ్ల కోమా జీవితం తర్వాత హరీష్ రాణాకు లైఫ్ సపోర్ట్ తొలగింపు.. ఢిల్లీ ఎయిమ్స్‌లో పాలియేటివ్ కేర్ పర్యవేక్షణలో తుది శ్వాస.

దిశ, వెబ్ డెస్క్: అనుకోని ప్రమాదంలో తీవ్ర గాయం కావడంతో 13 ఏళ్లుగా.. నరకం అనుభవిస్తున్న వ్యక్తికి ఎట్టకేలకు సుప్రీం కోర్టు తీర్పుతో విముక్తి లభించింది. పదమూడేళ్లుగా మంచానికే పరిమితమై, బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయిన హరీష్ రాణా (Harish Rana) జీవిత పోరాటం ముగింపు దశకు చేరుకుంది. 2013లో చండీగఢ్‌లో భవనంపై నుండి పడిపోయి మెదడుకు తీవ్ర గాయమవ్వడంతో హరీష్ కోమాలోనే (Persistent Vegetative State) ఉండిపోయారు. ఆయన పరిస్థితిని సమీక్షించిన సుప్రీంకోర్టు, కారుణ్య మరణానికి (Passive Euthanasia) అనుమతినిస్తూ మార్చి 11, 2026న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే ఆయనకు అమర్చిన లైఫ్ సపోర్ట్‌ను తొలగించే ప్రక్రియ కోసం హరీష్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు.
సుప్రీం తీర్పులో మానవీయ కోణం
జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ భావోద్వేగానికి గురైంది. "జీవించడం అంటే కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదని, గౌరవంగా బతకడం" అని పేర్కొంటూ, హరీష్‌ను కృత్రిమంగా బతికించడం కంటే ఆయనకు ప్రశాంతమైన మరణాన్ని అందించడమే సరైనదని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్ (CAN) వంటి వైద్య సహాయాన్ని ఉపసంహరించుకోవాలని, అయితే ఆ ప్రక్రియలో హరీష్‌కు ఎలాంటి నొప్పి, వేదన కలగకుండా చూడాలని ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది.
తల్లిదండ్రుల అలుపెరగని పోరాటం..
హరీష్ తండ్రి అశోక్ రాణా, తల్లి నిర్మల తమ కొడుకు కోసం గత 13 ఏళ్లుగా సర్వస్వం త్యాగం చేశారు. వైద్య ఖర్చుల కోసం తమ సొంత ఇంటిని కూడా అమ్ముకుని, అద్దె ఇంట్లో ఉంటూ హరీష్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. "మా కొడుకు పడుతున్న నరకాన్ని చూడలేక, తనను ప్రశాంతంగా వెళ్లనివ్వమని కోరుతున్నాం" అన్న వారి ఆవేదనను కోర్టు గుర్తించింది. "మీరు మీ కొడుకును వదిలేయడం లేదు, ఆయనకు గౌరవప్రదమైన మరణాన్ని ఇస్తున్నారు" అని న్యాయమూర్తులు వారిని ఓదార్చారు. ఈ కేసు భారతదేశంలో కారుణ్య మరణం, 'రైట్ టు డై విత్ డిగ్నిటీ' (గౌరవంగా మరణించే హక్కు) పై సరికొత్త న్యాయపరమైన స్పష్టతను ఇచ్చింది. కాగా సుప్రీం కోర్టు దేశ చరిత్రలో మొదటి సారి ఇలాంటి తీర్పును ఇచ్చినట్లు తెలుస్తుంది.






