- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బుల వివాదంతో స్నేహితుడి హత్య
డబ్బుల లావాదేవీల్లో జరిగిన వివాదం నేపథ్యంలో స్నేహితుడిని హత్య చేసి, మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి పరారైన ఇద్దరు నిందితులు, తమ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకుని స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దిశ, షాద్‌నగర్ : డబ్బుల లావాదేవీల్లో జరిగిన వివాదం నేపథ్యంలో స్నేహితుడిని హత్య చేసి, మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి పరారైన ఇద్దరు నిందితులు, తమ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకుని స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. షాద్‌నగర్ ఏసీపీ ఎస్. లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి గ్రామానికి చెందిన పానుగంటి అరవింద్, వీరకారి శివాజీ ఇద్దరూ స్నేహితులు. వీరు 2021 నుంచి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా మంగనూరు గ్రామానికి చెందిన మహమ్మద్ హసన్ (36)తో కలిసి మొక్కజొన్న, వడ్ల వ్యాపారం చేసేందుకు ఏఆర్ కాన్వాసింగ్ పేరుతో బిజినేపల్లిలో కార్యాలయం ఏర్పాటు చేసి వ్యాపారాన్ని ప్రారంభించారు.
వ్యాపార లావాదేవీల్లో భాగంగా హసన్ వద్ద నుంచి సుమారు రూ.65 లక్షలు రావాల్సి ఉండగా, రైతులకు చెల్లింపులు చేయాలని వారిపై ఒత్తిడి పెరిగింది. దీంతో పలుమార్లు హసన్‌ను డబ్బుల కోసం నిలదీశారు. తనకు హైదరాబాద్‌లో డబ్బులు రావాల్సి ఉన్నాయని, వాటిని తీసుకొచ్చి చెల్లిస్తానని హసన్ చెప్పడంతో, డబ్బులు ఇవ్వకపోతే అతన్ని హత్య చేయాలని ముందుగానే ఇద్దరూ పథకం రచించారు. ఈ నెల 22వ తేదీ ఉదయం హసన్‌ను తీసుకుని శివాజీ తన కారులో జడ్చర్ల సమీపంలోని పిస్తా హౌస్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ముగ్గురూ కలిసి అరవింద్ కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. అయితే, హసన్ చెప్పిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంతో అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణంలో షాద్‌నగర్ సమీపంలోని ఓ వైన్స్‌లో బీరు కొనుగోలు చేసి, బూర్గుల గ్రామ శివారులోని ట్రూల్యాండ్ మార్క్-9 ఎక్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెంచర్ వద్దకు చేరుకున్నారు.
అక్కడ డబ్బుల విషయమై వాగ్వాదం జరగగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శివాజీ హసన్‌ను గట్టిగా పట్టుకోగా, అరవింద్ బీరు సీసాతో అతని తలపై పలుమార్లు బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం హసన్ మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచుకుని మంగనూరు వైపు బయలుదేరారు. ఈ క్రమంలో హసన్ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తున్నట్లు గమనించి, తిరిగి హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి మృతదేహాన్ని వేపచెట్టు కింద పడేసి, పైన మొక్కలు కప్పి గుర్తుపట్టకుండా దాచిపెట్టారు. అనంతరం రక్తపు మరకలు ఉన్న బట్టలను గండిపేట సమీపంలో పడేసి, 23వ తేదీన రైలులో తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో తలదాచుకున్నారు.
చివరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు షాద్‌నగర్ పోలీసుల ఎదుట ఇద్దరు నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పర్యవేక్షణలో, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కేసు విచారణ అధికారి కె. సీతారాం, ఎస్‌ఐలు ప్రణయ్, శివారెడ్డి, సిబ్బంది రవీందర్, జాకీర్, కరుణాకర్, రాజు, సంతోష్ తదితరులు నిందితులు లొంగిపోయేలా చాకచక్యంగా పనిచేశారని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.






