ఉచిత వైద్యం ఉత్తమాటే.. సర్కారు దవాఖానాలో నిలువు దోపిడీ!

by Jakkula.Mamatha |

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉచిత వైద్యం ఉత్తమాటే.. సర్కారు దవాఖానాలో నిలువు దోపిడీ!
X

దిశ, నాగర్ కర్నూల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి పనిలో సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రసూతి వార్డులు పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు. ప్రసవం పూర్తయిన తర్వాత శుభ్రపరిచే సిబ్బంది నుంచి వార్డు బాయ్స్ వరకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

ప్రసూతి వార్డుల్లో బేరసారాల దందా!

ఆస్పత్రిలోని ప్రసూతి వార్డుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గర్భిణీలకు కాన్పు పూర్తయ్యాక, వారిని వార్డుకు తీసుకువచ్చే క్రమంలోనే అసలు కథ మొదలవుతుంది. స్ట్రెచర్‌ పైనుంచి రోగిని మంచం మీదకు దించిన వెంటనే శానిటైజేషన్‌ సిబ్బంది, వార్డు బాయ్స్‌ యథేచ్ఛగా బేరసారాలకు దిగుతున్నారు. కొడుకు పుట్టినా, బిడ్డ పుట్టినా.. ఆ సంతోషం కంటే ముందు అక్కడ నిలబడే సిబ్బందికి ముట్టజెప్పాల్సి వస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే కనీసం బెడ్‌ షీట్‌ మార్చడానికి కూడా రావడం లేదు. నర్సులు సైతం పలకరిస్తే కసురుకుంటున్నారు" అని ఓ బాధితుడి బంధువు ఆవేదన వ్యక్తం చేశారు.

అంతటా అపరిశుభ్రత..

వైద్యం మాట దేవుడెరుగు కానీ, ఆసుపత్రి అపరిశుభ్రతతో రోగులు కొత్త రోగాల బారిన పడే పరిస్థితి దాపురించింది. వార్డులు, మరుగుదొడ్లు సకాలంలో శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తుండటంతో రోగులు, వారి తోడుగా వచ్చిన బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు.

తాగునీటికీ అగచాట్లే..

ఆసుపత్రిలో ఐసీయూకు వెళ్లే దారిలో ఒకే ఒక తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. అయితే అందులో ఎప్పుడూ నీళ్లు ఉండటం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన 'రూపాయి వాటర్ ప్లాంట్' మాత్రమే ఇక్కడి వారికి ఏకైక దిక్కయింది. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆస్పత్రికి కొందరు కిందిస్థాయి సిబ్బంది వల్ల చెడ్డపేరు వస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ అక్రమ వసూళ్ల పై సమగ్ర విచారణ జరిపి, పారిశుధ్య, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

తప్పు చేస్తే సస్పెండ్‌ చేస్తాం:డాక్టర్‌ ఉషారాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

ఆసుపత్రిలో సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. శానిటేషన్ సిబ్బంది గానీ, వార్డ్ బాయ్స్ గానీ ఎవరైనా రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారిని విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తాం. ఆస్పత్రిలో దుర్వాసన రాకుండా, పరిశుభ్రత పాటించాలని శానిటేషన్ సిబ్బందికి ఇప్పటికే గట్టి ఆదేశాలు జారీ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉషారాణి తెలిపారు.

Next Story