మినరల్ వాటర్ పేరుతో మోసమా?

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీలో నిర్వహిస్తున్న ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌పై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు.

మినరల్ వాటర్ పేరుతో మోసమా?
X

దిశ, కొత్తగూడెం టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీలో నిర్వహిస్తున్న ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌పై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. మినరల్ వాటర్ పేరుతో విక్రయిస్తున్న బాటిళ్లపై తేదీల్లో వ్యత్యాసాలు, ఎంఆర్పీ మార్పులు, బార్కోడ్ ద్వారా వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు వినియోగదారుల్లో అనుమానాలకు దారితీస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, ప్లాంట్ నిర్వాహకుడు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని చెబుతూ నీటి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే విక్రయిస్తున్న కొన్ని బాటిళ్లపై తయారీ తేదీ (Manufacturing Date) జూలై 2026గా ఉండగా, గడువు తేదీ (Expiry Date) జనవరి 2026గా ముద్రించబడిందని వారు ఆరోపిస్తున్నారు. తయారీ తేదీ కంటే ముందే గడువు తేదీ ఉండడంపై ప్రశ్నించినా సరైన వివరణ ఇవ్వలేదని స్థానికులు పేర్కొంటున్నారు.

అలాగే, బాటిల్‌పై మొదట 10 ఎంఆర్పీ ముద్రించి ఉండగా, దానిపై మరో స్టిక్కర్ అతికించి 12కు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇది వినియోగదారుల హక్కులకు విరుద్ధమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ లేదా బార్కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు తయారీ సంస్థ, తయారీ ప్రదేశం, లైసెన్స్ వంటి ప్రాథమిక వివరాలు కనిపించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. సాధారణంగా ప్యాకేజ్డ్ ఆహార, పానీయ ఉత్పత్తులపై ఈ వివరాలు అందుబాటులో ఉండాలని వారు పేర్కొంటున్నారు. ఈ విషయమై ప్లాంట్ నిర్వాహకుడిని ప్రశ్నించగా, తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని మాత్రమే చెబుతున్నారని, పూర్తి వివరాలు వెల్లడించడం లేదని స్థానికులు ఆరోపించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ వ్యవహారంపై ఆహార భద్రత శాఖ, మున్సిపల్ అధికారులు, సంబంధిత నియంత్రణ సంస్థలు వెంటనే తనిఖీలు నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story